Reading Time: 2 minutes

14 కి.మీ ప్రయాణానికి రూ.4వేలా..? బెంగళూరు టాక్సీ స్కామ్‌తో కంటెంట్ క్రియేటర్ షాక్

Caption of Image.

3 ఏళ్ల విదేశీ ప్రయాణం ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన యూకే కంటెంట్ క్రియేటర్‌కు బెంగళూరు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు నగరానికి కొత్త కావడంతో స్థానిక రవాణా వ్యవస్థపై అవగాహన లేని అభీష్ణ ఎన్ అనే యువతి ట్యాక్సీ డ్రైవర్ మోసానికి బలయ్యింది. ఎయిర్‌పోర్టు నుంచి ట్యాక్సీ ఎక్కే ముందే డ్రైవర్‌ను ఛార్జీల గురించి అడగ్గా.. మీటర్ ప్రకారం డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. అతని మాటలను నమ్మి ఆమె క్యాబ్ ఎక్కింది.

కేవలం 14 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి డ్రైవర్ ఏకంగా రూ.4వేల బిల్లు చేతిలో పెట్టాడు. అప్పుడు ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు ట్యాక్సీలు ఇలాగే నడుస్తాయేమోనని భావించి ఆ మొత్తాన్ని చెల్లించేసింది. అయితే ఆ తర్వాత పరిశీలిస్తే ఆ రసీదు పూర్తిగా నకిలీదని.. తనను మోసం చేశారని ఆమెకు అర్థమైంది. మూడేళ్ల తర్వాత కొత్త నగరానికి రావడంతో స్థానిక విధానాలు తెలియక తాను ఈజీగా మోసపోయానని ఆమె లింక్డ్‌ఇన్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేసింది.

డబ్బు పోయినందుకు కంటే.. ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసం చేయడం తనను ఎంతగానో కలచివేసిందని ఆమె పేర్కొంది. ఎవరికైనా కొత్త ప్రదేశాలకు వెళ్లే ముందు రవాణా ప్రత్యామ్నాయాలపై, సరైన ఛార్జీలపై ముందే అవగాహన ఉండాలని హెచ్చరించింది. అభీష్ణ పనిచేస్తున్న పార్ట్‌టైమ్ కంపెనీ ఫౌండర్ కూడా ఈ పోస్ట్ స్పందిస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టు ట్యాక్సీల్లో ఓవర్‌ఛార్జింగ్ సమస్య సంవత్సరాలుగా ఉందని దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల సేఫ్టీ, ట్యాక్సీ మోసాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ఎయిర్‌పోర్టుల నుంచి నగరానికి వెళ్లే ప్రయాణికులు అనధికారిక క్యాబ్‌లను ఆశ్రయించకుండా.. అధికారిక ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్లు లేదా యాప్ ఆధారిత క్యాబ్‌లను బుక్కింగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌పోర్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎయిర్‌పోర్టు అథారిటీలు కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.