
లక్ష్మీపురమనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్య చాలా నిజాయితీపరుడు. మరుక్షణంలో ప్రాణం పోతుంది అన్నా సరే, కష్టంలో ఉన్నవారి మేలు కోరే మంచి మనిషి. రంగయ్యకు భార్య వెంకటమ్మ, కూతురు బంగారు తల్లి ఉన్నారు. గ్రామంలో కూడా రంగయ్యకు చాలా మంచి పేరుంది. పేరుకే పేదవాడే గానీ సహాయపడటంలో శ్రీమంతుడు. తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఉండగా, ఒకరోజు పొలం దగ్గరకు వెళ్లి దిగులుగా ఉన్న రంగయ్యను చూసిన తన స్నేహితుడు దివాకరం,
ఏంటి రంగయ్య అలా దిగులుగా ఉన్నావ్?
ఏం చెప్పమంటావ్ దివాకరం. మన ఊళ్ళో వాళ్ళందరూ చెరుకు తోటే పండిస్తున్నారు కానీ, ఒక్కరు కూడా వరి నాట్లు వేయడం లేదయ్యా. మనమంతా రైతులే అయినా, ధాన్యం కోసం పక్క గ్రామానికి వెళ్లి కొనాల్సి వస్తుంది.
నువ్వు చెప్పింది నిజమే కానీ, మన ఊరికి దగ్గర్లో చెరుకు ఫ్యాక్టరీ ఉంది. అందుకే చెరుకు పండిస్తున్నారు. బయటకు తీసుకెళ్లి అమ్మనక్కరలేదు కదా. వాళ్లే వచ్చి తీసుకెళ్తున్నారు. రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి. నష్టపోకుండా సరిపడ డబ్బులు ఇస్తున్నారు. ఈ లెక్కన బాగానే గిట్టుబాటు అవుతుంది కదా.
నేనూ అదే చెప్తున్నా దివాకరం. ఈ ఊళ్ళో ఒక్కరైనా వరి పండిస్తే, గ్రామస్తులందరూ అక్కడే ధాన్యం తీసుకుంటారుగా. అప్పుడు వరిపంటకు కూడా గిట్టుబాటు ఉంటుందిగా.
అందరూ చెప్పేవాళ్ళైతే ఆచరించేది ఎవరు రంగయ్య. అసలు వరి పండుతాదో పండదో తెలియని పొలంలో చెరుకు తోట తీసేసి వరి పండించే సాహసం ఎవరు చేస్తారు? మనమా రైతుం. ఏ మాత్రం నష్టం వచ్చినా సరే, పొలానికి కొట్టాల్సిన మందు మనం తాగాల్సి వస్తుంది.
అందుకే దివాకరం. నా పొలంలో చెరుకు తీసేసి, వరి పండిద్దాం అనుకుంటున్నా.
నీకేమైనా మతి పోయిందా? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖ పెడుతున్నావ్.
ఇందాక నువ్వే కదా అందరూ చెప్పేవాళ్ళైతే, ఆచరించేది ఎవరని? నేనే ఆచరించి చూపిస్తాను.
ఇక్కడ ఇంకో ముప్పు కూడా ఉంది రంగయ్య. ఒకవేళ నీ పొలంలో వరి బాగా పండిందనుకో, మిగతావాళ్ళు ఊరుకుంటారా?
ఏ, ఏం చేస్తారు?
మనం ఎదగకపోయినా పర్వాలేదు. మన పక్కవాడు మాత్రం నూతిలో కప్పలా అక్కడే ఉండిపోవాలని అనుకునే సమాజం మనది. నీ ఎదుగుదలను ఓర్చుకోలేక పంట పాడు చేస్తారు కూడా.
అలా అని చూస్తూ కూర్చోలేం కదా. ఆ బాధలేవో నేనే పడతా. రేపటి నుంచి చెరుకు తీసేసి, వరిని పండిస్తా.
అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా భార్య వెంకటమ్మతో చెప్తాడు రంగయ్య. భర్త మాటకు అడ్డుపడని వెంకటమ్మ, రంగయ్య నిర్ణయాన్ని గౌరవించడంతో పొలంలో చెరుకు తీసేసి వరి నాట్లు వేస్తాడు. కొన్ని రోజుల తర్వాత,
ఏవయ్యా? దాచుకున్న డబ్బులన్నీ ఆ పొలం మీద పెట్టుబడి పెట్టడమే కాకుండా, అందిరి కాడికి అప్పు తెచ్చావ్. అక్కడ వరి పండదని చెప్తున్నా, వినకుండా వరి నాటావ్. ఇప్పుడు అక్కడ వరి పంటగా పండకపోతే, అందరం ఉరేసుకు చావాలి.
అట్లాంటి మాటలు మాట్లాడకే. మనం ఏనాడు ఎవరికీ చెడు చేయలేదు. అలాంటప్పుడు ఆ దేవుడు మనకు అన్యాయం ఎందుకు చేస్తాడే? అలా చూస్తా ఉండు. మన పంటంతా పచ్చని సేలతో పచ్చదనంగా మారిపోద్ది.
నీకు తెలియదయ్యా, ఈ రోజుల్లో మంచితనం అని మడిగట్టుకొని కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంటాయి మన బ్రతుకులు. నువ్వా మన కోసం ఆలోచించకుండా, ఊరి బాగోగు కోసం ఆలోచిస్తున్నావ్.
మన బ్రతుకులకైతే, ఉన్నంతలో తింటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. ఇంతకంటే ఏం కావాలి?
ఇప్పటివరకు నువ్వు అన్నట్టే ఉందిలే. కానీ ముందు రోజుల్లో జరగబోయే విషయం గురించి ఆలోచిస్తున్నా.
నువ్వు ఉన్నవి లేనివి ఆలోచించి ఊ గవరా పడిపోకు. అంతా మంచే జరుగుతుంది సరేనా?
తెల్లవారిన తర్వాత రంగయ్య లేస్తాడు. ఇంటి బయట ఉన్న జామపళ్ల చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు వైపు చూస్తాడు. చెట్టంతా పళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఇంతలో భార్య వస్తుంది.
చూడు వెంకటమ్మ, జామకాయలు కోసి పక్కన పెట్టు. ఊళ్ళో ఉన్న పేద పిల్లలకు ఇస్తాను. పాపం, ఆర్థిక పరిస్థితి కారణంగా వాళ్లకు సరైన తిండే ఉండటం లేదు.
ఏంటయ్యా నువ్వు. మన పరిస్థితి ఏమైనా బాగుందా? తాగుదామంటే గంజి నీళ్లు కూడా కరువైపోయాయి. పేరుకు రైతును మాత్రమే, తినడానికి బియ్యం కూడా ఉండట్లేదు. దేశానికి అన్నం పెట్టే రైతు ఇంట్లోనే బియ్యం లేకపోవడం సిగ్గుచేటు కదూ. ఆ జామకాయలు సంతలో అమ్మి డబ్బులు తెమ్మంటే అది తప్పు ఇది తప్పు అని నీతులు చెప్తావ్.
అది కాదు వెంకటమ్మ, ఇప్పుడు ఇంత పెద్ద చెట్టుగా ఉన్న దీన్ని పదేళ్ల క్రితం చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసుకువచ్చి నీళ్లు పోసి పెంచాను. నీడనిచ్చే చెట్టుకు కూడా నీడ లేకపోతే ఎలా? అందుకే ఎండ పడకుండా జాగ్రత్తగా చూసుకుంటా. ఈ మొక్కను తెచ్చినప్పుడు నాలో ఎలాంటి స్వార్థ బుద్ధి లేదు. ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదని చెప్పి పళ్లు అమ్ముకోవడం మంచిది కాదు. అయినా ఈ జామ పళ్లను పేదవాళ్లకు పసి పిల్లలకు పంచిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది.
నీ మాట నీదే గాని ఎవరి మాట వినవు. అసలే మన పరిస్థితి బాలేదయ్యా. కాస్త ఈ చెట్టు కాయలను నమ్ముకుంటే ఆధారంగా ఉంటదిలే అనుకుంటే, ఏదేదో మాట్లాడతావ్. మనకు డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? అడిగినప్పుడల్లా డబ్బులు రావడానికి? మన అప్పులన్నీ తీరడానికి?
రంగయ్య వెంకటమ్మ సంభాషణలను జామ చెట్టు వింటూ ఉంటుంది.
సర్లే, పొలం దగ్గరికి వెళ్లి పంట పరిస్థితి చూసొస్తాను. ఈ లోపల చెప్పిన పని చెయ్.
అంటూ రంగయ్య పొలం దగ్గరకు వెళ్లగా, ఆ పొలాన్ని చూసి ప్రాణం పోయినంత పని అవుతుంది. పొలమంతా నీరు చేరి చెల్లాచెదురుగా పడి ఉంటుంది.
దేవుడా! ఇప్పుడు ఏం చేయాలి? నా ఆశలన్నీ ఈ పొలం మీదే పెట్టుకున్నారే, నాకు ఎందుకు ఇలా జరిగింది? ధాన్యం కోసం ఊళ్ళో వాళ్ళు పొరుగూరు వెళ్లకుండా చేద్దామనుకున్నానే. దీన్ని నమ్ముకొని అప్పులు చేశాను. ఇప్పుడు వాళ్ల రుణం ఎలా చెల్లించాలి? మా ఆవిడకి ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో! అంటూ ఏం చేయాలో తెలియని స్థితిలో అక్కడ కూర్చొని బాధపడుతూ ఉండగా, అక్కడికి దివాకరం వస్తాడు.
ఏంటి రంగయ్య? అలా దీనంగా కూర్చున్నావ్?
కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి వరి పొలం పండిద్దాం అనుకున్నాను. తీరా చూశావా? ఎంత పని అయ్యిందో. రాత్రి వచ్చిన గాలి వానకు నా పొలం మట్టిలో కలిసిపోయింది. అప్పటికి మా ఆవిడ చెప్తూనే ఉంది. మనకెందుకయ్యా ఈ పొలాలు, కూలీ పని చేసుకుంటే సరిపోతుంది కదా అని.
చూడు రంగయ్య, గాలివానకు నీ పొలం కొట్టుకుపోయింది. అందులో నీ తప్పేముంది? అయినా ఇక్కడ వరి పంట పండించొద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు చూడు, మట్టి దిబ్బలా మారిన నీ పొలాన్ని చూసి జాలి పడటం మాట దేవుడెరుగు, ఓర్చుకోని కళ్ళు చూసి సంతోషిస్తాయి కూడా.
ఇప్పుడు ఎలా దివాకరం? ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం కనపడటం లేదే. నా భార్య పిల్లలు ఏమైపోతారో. ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలాగో అర్థం కావడం లేదు.
నాకో అనుమానం రంగయ్య. నీ పొలానికి పక్కన ఉన్న సూరి గాడి పొలం బాగానే ఉంది. అటుపక్కన ఉన్న వీరన్న పొలం కూడా బాగానే ఉంది. మధ్యలో ఉన్న నీ పొలానికి మాత్రమే ఇలా ఎలా అయ్యింది? ఇందులో ఏదో మర్మం ఉంది రంగయ్య. ఇది ఏ గాలి వానకో కొట్టుకుపోయింది కాదు. ఎవరో కావాలనే చేసినట్టు అనిపిస్తోంది.
హాల్ని ఈల్నీ అనుకుని ఏం లాభం దివాకరం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నా ముందు కటిక చీకటి తప్ప వెలుగు కనపడటం లేదు. నా భార్య పిల్లలు ఏమైపోతారో, ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలాగో అర్థం కావడంలేదే.
అనుకుంటూ రంగయ్య అక్కడి నుంచి పరధ్యానంలో బయలుదేరుతాడు. దారిలో కూతురు బంగారు తల్లి ఎదురవుతుంది. కూతుర్ని చూసిన వెంటనే తన బాధను కనపడనీయకుండా,
ఏమ్మా? బంగారు తల్లి ఇలా వచ్చావ్?
నువ్వు ఏమీ తినకుండా వచ్చేసావంట కదా నాన్న. అమ్మ నీకు ఈ సద్దన్నం ఇచ్చి రమ్మంది. ఏంటి నాన్న అలా ఉన్నావ్?
ఏం లేదమ్మా, కంట్లో ఏదో నలుసు పడితేనూ.
అది కాదనిపిస్తోంది, ఏమైందో చెప్పు నాన్న.
ఊరుకో తల్లి. ఏం లేదన్నాను కదా. నువ్వు అన్నం తీసుకొని ఇంటికి వెళ్ళిపో. చిన్న పని ఉంది అది చూసుకొని వచ్చేస్తానని అమ్మకు చెప్పు.
అని బిడ్డకు నచ్చచెప్పి ఇంటికి పంపించేసిన రంగయ్య,
అప్పు తీర్చకపోతే నా పరువు పోతుంది. నా భార్య పిల్లలు రోడ్డున పడతారు. అదే నేను చచ్చిపోతే జాలితోనో, దయతోనో నా భార్య బిడ్డల జోలికి వెళ్ళరు. నేను చనిపోవడమే సరైన పని. చివరిసారిగా భార్య బిడ్డలను చూసి, ఆ జామ చెట్టు కింద కాసేపు పడుకొని చచ్చిపోతా.
అంటూ మనసులో అనుకున్న రంగయ్య ఇంటికి వెళ్తాడు.
ఏమైందండీ? పంట పరిస్థితి ఏంటి?
దానికే, బేషుగ్గా ఉంది. ఇంకొంచెం మందు కొడితే, ధాన్యం బస్తాలే బస్తాలు.
మరి బంగారు తల్లేంటి, నాన్న దిగులుగా ఉన్నారంటోంది?
దాని మొహం. కంట్లో ఏదో పడిందిలేవే, ఇంకేదో అనుకుంది అంతే. చెప్పడం మర్చిపోయాను, నేను పట్నం వెళ్తున్నాను. రావడానికి ఆలస్యం అవ్వచ్చు. నా కోసం చూడకుండా మీరు తినేయండి. సరేనా?
అని వెంకటమ్మకు మంచి చెడ్డ చెప్పి, బయటకు వచ్చేసిన రంగయ్య, వెనక వైపు నుంచి వచ్చి జామ చెట్టు వైపు దీనంగా చూస్తూ, ఆ చెట్టు కింద కూర్చొని తను చనిపోతే భార్యాపిల్లలు ఏమైపోతారో అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రంగయ్యకు అదృశ్యవాణి వినిపిస్తుంది.
ఎందుకు ఏడుస్తున్నావు రంగయ్య? పంట పొలం పాడైపోయిందని బాధపడుతున్నావా? నువ్వు మంచివాడివి రంగయ్య, నీకేమీ జరగదు, దిగులు చెందకు.
కనపడకుండా ఎవరు మాట్లాడుతున్నారో తెలియని రంగయ్య, ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు.
ఎవరు నువ్వు, దెయ్యానివా? నువ్వెంత భయపెట్టాలనుకున్నా నేను భయపడను. చద్దామని ఇక్కడికి వచ్చినాను. ఇక నేనెందుకు భయపడాలా?
నేను దెయ్యాన్ని కాదు రంగయ్య, జామ చెట్టును. చిన్నప్పుడు నువ్వే కదా రోడ్డు పక్కన పీకి పడేసి ఉన్న నన్ను తీసుకొచ్చి మీ ఇంటి పెరట్లో నాటి ప్రాణం పోశావు.
నిజంగా నువ్వు జామ చెట్టువా? అయినా చెట్టెలా మాట్లాడుతుంది?
నువ్వు నాకు ప్రాణదాతవే కాదు, మంచి స్నేహితుడివి కూడా.
ఇంతకీ నువ్వెవరో చెప్పు?
నేను దేవతా చెట్టుని. శాపం కారణంగా జామ చెట్టుగా పుట్టిన నేను, ఒక గొర్రెల కాపరి నన్ను వేళ్లతో సహా పీకి పడేశాడు. నువ్వు నన్ను మళ్లీ నాటి నీళ్లు పోసి ప్రాణం పోశావు.
నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. మరి ఇప్పుడెందుకు వచ్చావ్?
ఇంతకాలం నీకొక పరీక్ష పెట్టాను. ఆ పరీక్షలో నువ్వు గెలిచి నీ గొప్ప మనసుని చాటుకున్నావు. కాబట్టి నీకు కావలసిన వరం కోరుకో.
ఏంటా పరీక్ష?
ఈ పదేళ్ల కాలంలో నా నుంచి వచ్చిన కాయలను అమ్మి ధనం సంపాదిస్తే, అందరి లాంటి మనుషుల్లానే నువ్వు కూడా వరానికి అర్హత పొందేవాడివి కాదు. కానీ నీ కుటుంబం ఆకలితో ఉన్నా సరే, వాటిని తినకుండా బయటి పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చావు చూడు, అప్పుడే వర ప్రసాదం పొందేందుకు పూర్తి అర్హుడివి అయ్యావు.
ఇంత మాట్లాడుతున్నావు గానీ, కనిపించవే మరి.
నువ్వు ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మితేనే నేను నీకు కనపడగలను. లేదంటే ఇలా మాట రూపంలోనే వినపడతాను.
సరే, నీ మాటలు నమ్ముతున్నాను. కనపడు.
చెప్పిన మాట ప్రకారం అదృశ్య దేవత రంగయ్య ముందు ప్రత్యక్షమవుతుంది.
ఇప్పటికైనా నమ్ముతావా రంగయ్య? కష్టం వచ్చినప్పుడు ధైర్యం కూడదీసుకొని ఎదుర్కోవాలి కానీ, ఇలా నీరుగారిపోయి మట్టిలో కలిసిపోతారంటే మనిషి జీవితానికి విలువ ఉంటుందా?
ఏం చేయనమ్మా, పంటపై నమ్మకంతో దొరికిన చోటల్లా అప్పు తీసుకొచ్చాను. నా మీద నమ్మకంతో పాపం, ఎంతోమంది అప్పిచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు వాళ్ల రుణం చెల్లించకపోతే, వాళ్ల దృష్టిలో నేను మోసగాడినే కదా అమ్మా. నమ్మకద్రోహి అనే ముద్ర వేసుకొని ఎలా బ్రతకగలను?
నువ్వు తొందరపడి ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోకు. అయినా నిన్న నువ్వే కదా మీ ఆవిడకు ధైర్యం చెప్పావు.
ఇప్పుడు నా దిగులంతా ఈ ఊళ్ళో వరి పంట ఎలా పండించాలి, అప్పు తీసుకున్న వాళ్లకు ఏ సమాధానం చెప్పాలి, నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని.
నిన్న మీ ఆవిడ ఇక్కడే ఒక మాట అంది, గుర్తుందా?
ఏమంది?
అదే, చెట్లకు డబ్బులేమన్నా కాస్తున్నాయా? మన అప్పులు తీరడానికి అని.
ఏదో పిచ్చిది కోపంలో అంది. అలా చెట్లకేమన్నా డబ్బులు కాస్తాయా ఏంటి?
కొనఊపిరితో ఉన్న నన్ను తీసుకొచ్చి బతికించావు కాబట్టి, ఇదిగో ఈ జామ చెట్టుకు డబ్బులు కాచే వరం ఇస్తున్నాను. నీ అప్పులన్నీ తీర్చేసుకో. మంచి ఇల్లు కట్టుకో. ఊరి చివరన నీకిష్టమైన వరి పొలం వేసి బాగా పండించు. గ్రామస్తులకు ధాన్యం కొనుగోలు సులభం చెయ్. నీ బంగారు తల్లిని బాగా చదివించు.
ఏంటో తల్లీ, నాకంతా అయోమయంగా ఉంది. నువ్వు చెప్తుంటే ఏదో కల కంటున్నట్లుగా ఉంది.
అదే రంగయ్య, నీ కల నిజమయ్యే సమయం వచ్చింది. నీకు నమ్మకం కలగాలంటే ఈ రాత్రికి ఈ జామ చెట్టు కిందే పడుకో. రేపు ఉదయం లేవగానే కళ్ళు తెరవకుండా నీకు అందిన ఆకుల్ని తెంచుకొని ఇంట్లోకి వెళ్లి దేవుడి పటం దగ్గర పెట్టి, నీకు ఏం కావాలో కోరుకో. ఆ ఆకులన్నీ నీకు అవసరమయ్యే ధనంగా మారిపోతాయి.
అదృశ్య దేవత చెప్పినట్లుగానే, రంగయ్య దేవుడి దగ్గరికి వెళ్లి,
నేను అప్పు తీసుకున్న వాళ్లకు తిరిగి ఇచ్చేసేంత సొమ్ము కావాలి దేవుడా.
అని దండం పెట్టుకోగానే ఆ ఆకులు సొమ్ముగా మారిపోతాయి.
చూశావా రంగయ్య? ఇప్పటికైనా నమ్ముతావా? ఇకపై కూడా నువ్వు ఇలానే నిజాయితీగా జీవించు. ఏనాడూ అధైర్యపడకు. ఓపిక పడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఇంకో ముఖ్య విషయం, నువ్వు తప్ప ఎవరు ఆకులు కోసినా అవి ఆకులు గానే ఉంటాయి. నువ్వు తుంచితే మాత్రమే ధనంగా మారుతాయి.
అని చెప్పిన అదృశ్య వాణి మాయమవుతుంది. వెంటనే ఈ విషయం భార్య పిల్లలకు చెప్పడంతో ఎంతో సంతోషిస్తారు. ఆ మరుసటి రోజు రంగయ్య ఇంటికి దివాకరం రాగా, దివాకరం,
ఏంటి రంగయ్య, మొహం మెరిసిపోతోంది. అప్పులోళ్ల బాకీలన్నీ తీర్చేశావట?
అదో పెద్ద కథలే దివాకరం. మన ఊరి చివర్లో మూడు ఎకరాలు వరి పండించడానికి నీ సహాయం కావాలి. ఎలాగైనా సరే, ఈ ఏడాదే మన గ్రామస్తులు ఇక్కడే ధాన్యం కొనేలా చూడాలి.
నువ్వు ఎవరికీ హాని చేయని మంచివాడివి రంగయ్య. పైగా నువ్వు ఊరి మేలు కోసం ఆలోచిస్తున్నావు. నీకు సహాయం చేయకుండా ఉంటానా? నాకు చేతనైన సహాయాన్ని చేస్తాను. ఏం చేయాలో చెప్పు. మూడు ఎకరాలు కొనడానికి ఇంతకీ అంత డబ్బు ఎలా వచ్చింది రంగయ్య?
మా ఇంటి పెరట్లోని చెట్టుకు డబ్బులు కాస్తున్నాయిలే.
చతురులు ఆడకు రంగయ్య. ఎక్కడైనా చెట్లకు డబ్బులు కాస్తాయా ఏంటి? ఇలాంటివన్నీ కథల్లోనే ఉంటాయి.
ఏంటో, నిజం చెప్పినా కొంతమంది అర్థం చేసుకోరు.
అలా అనుకున్నట్లుగానే లక్ష్మీపురంలోని వరి పంట పండించి గ్రామస్తులకు ధాన్యం కొనుగోలు సులభం చేసిన రంగయ్య, అప్పులన్నీ తీర్చేసి, సొంత ఇల్లు కట్టుకొని, తన బిడ్డతో పాటు ఆ జామ చెట్టుకు రోజూ పూజలు చేస్తూ ఆ కాయలను పేదలకి పంచుతూ ప్రశాంత జీవితాన్ని గడపసాగాడు.