Reading Time: < 1 minute
Tamil Nadu Liquor Policy Tasmac Controversy

తమిళనాడులో మద్యం విక్రయాలు, టాస్మాక్ (TASMAC) పాలసీపై తీవ్ర స్థాయి రాజకీయ దుమారం రేగుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విధానాన్ని అమలు చేయడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న మాన్యువల్ ఇండెంట్ పద్ధతికి స్వస్తి పలికి, ప్రత్యేక హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారానే నేరుగా దుకాణాల నుంచి స్టాక్ ఇండెంట్‌ను నమోదు చేసే ప్రక్రియకు విద్యాశాఖ, అబ్కారీ శాఖలు శ్రీకారం చుట్టాయి.

అయితే ఈ డిజిటలైజేషన్ తోపాటు రాష్ట్రంలో ఉన్న సుమారు 2,500 టాస్మాక్ దుకాణాలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను పీఎంకే (PMK) అధినేత అన్బుమణి రామదాస్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరపడం సిగ్గుచేటని, దాన్ని సరిదిద్దడానికి ప్రైవేటీకరించడం అంటే ఇల్లు ఈగలొచ్చాయని తగలబెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే విచ్చలవిడిగా అక్రమ అమ్మకాలు పెరిగి యువత, విద్యార్థులు మరింతగా మధ్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందన్నారు.

టాస్మాక్ వ్యవస్థను ప్రైవేటీకరించడం సరికాదని, దానికి బదులుగా రాష్ట్రంలో దశలవారీగా మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలు, విపక్షాల డిమాండ్ల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.