
ఇది నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆరేళ్ల చిన్నారి మూడు రోజులుగా శకలాల కింద ప్రాణాలతో బతికి ఉండటం. నేపాల్ లో వరద బీభత్సానికి కూలిపడిన పెద్ద పెద్ద ఇండ్లు, బ్రిడ్జీలు, వరదలో కొట్టుకొచ్చిన రాళ్లు.. దానికి తోడు బురద.. ఇంతటి ఘోరమైన బురదతో కూడిన శకలాల కింద చిక్కుకుని మూడు రోజులుగా బతికి ఉండటమంటే ఆ చిన్నారిని మృత్యుంజయురాలు అనే అనవచ్చు.
ఇటీవల సంభవించిన జల ప్రళయంలో నేపాల్ మృతుల దిబ్బగా మారిపోయింది. ఎటు చూసినా కూలిపోయిన ఇండ్లు, ఫస్ట్ ఫ్లోర్ వరకు పేరుకు పోయిన బురద, శకలాలు, బురదలో బయటపడుతున్న శవాలు. ఇప్పటికే 650కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. రసువా జిల్లాలో సహాయక చర్యల్లో భాగంగా ఆరేళ్ల చిన్నారిని బయటికి లాగిన ఘటనలో మూడురోజులుగా ప్రాణాలతో ఉండటం అద్భుతంగా చెబుతున్నారు.
భోటే కోసి వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్న పోలీసు బృందం, శిథిలాల కింద నుంచి వినిపిస్తున్న ఏడుపులను విని అతి కష్టం మీద చిన్నారిని వెలికి తీశరు. తిమురేలో చిక్కుకుపోయిన చిన్నారిగా గుర్తించారు. గాయాలతో ఉన్న చిన్నారిని చికిత్స కోసం కాఠ్మండుకు తరలించారు.
2026 ఆగస్టు 26( బుధవారం) హిమానీనదం కూలిపోవడం వల్ల సంభవించిన వరదలతో ధ్వంసమైన ప్రాంతాలలో సహాయక బృందాలు గాలిస్తుండగా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
రాళ్లు, మంచు, బురద, నీటితో సునామీ వచ్చినట్లుగా వచ్చిన వరదతో నేపాల్ లో ఎన్నడూ లేని విధ్వంసం జరిగింది. ఈ విపత్తులో నేపాల్ 669 మంది, టిబెట్‌లో ఏడుగురు బలైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అన్నీ ధ్వంసం అయిపోయాయి. నేపాల్ లోని కొన్ని ప్రాంతాలను మళ్లీ పునర్నిర్మించాల్సిన పరిస్థితి.
నేపాల్ , టిబెట్ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో సుమారు 2 వేల426 మంది , టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో 554 మంది గల్లంతైనట్లు చెబుతున్నారు.
గల్లంతైన వారిలో కనీసం 540 మంది విదేశీయులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో చాలామంది కైలాష్ మానసరోవర్ యాత్ర చేపట్టిన ఇండయన్ టూరిస్టులే ఉన్నట్లు తెలుస్తోంది.