Reading Time: < 1 minute
Visakhapatnam Tragedy Auto Driver Wife And Two Children Die

Vizag Tragedy: రాఖీ పండుగ రోజున విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడిని మల్ల ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం కొత్తవలస కాగా, జీవనోపాధి కోసం పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, ఆయన భార్య కూరగాయల వ్యాపారం చేసేవారని సమాచారం.

ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని సరదాగా గడిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అదే రోజు రాత్రి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రవీణ్ కుమార్ వాట్సాప్ స్టేటస్‌లో ‘RIP’ అని పెట్టినట్లు సమాచారం. అనంతరం ఆయనతో పాటు భార్య, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నలుగురూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు సహా ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కుమార్ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.