Reading Time: 2 minutes
వజ్రాల పర్వతం రహస్యం.. రాముడి ధర్మంతో సాధించిన విజయం..!

స్వర్ణపురి అనే అందమైన గ్రామానికి సరిహద్దులో గగనాన్ని తాకేలా ఉండే వజ్రాల పర్వతంపై అపారమైన రత్నాలు, దివ్యమైన నాగమాణిక్యం ఉన్నాయని జానపద ప్రతీతి. అయితే అక్కడికి వెళ్లిన వారెవరూ తిరిగి రారని, ఒక వింత రాక్షసుడు అక్కడ కాపలా ఉన్నాడని ఊరి పెద్దలు చెప్పేవారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ యువకుడు చెల్లెలి ప్రాణాల కోసం పర్వత ప్రయాణానికి బయల్దేరాడు..

స్వర్ణపురికి చెందిన రాముడు అనే తెలివైన, ధైర్యవంతమైన నిరుపేద యువకుడి చెల్లెలు సుమ తీవ్రమైన వ్యాధిన పడింది. ఆమెను బ్రతికించాలంటే వజ్రాల పర్వత లోయల్లో మాత్రమే దొరికే నల్ల కలువ మూలిక కావలసి వచ్చింది. మరోవైపు క్రూర జమీందారు ధర్మరాజు అప్పు తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తానని బెదిరించాడు. దీంతో రాముడు పర్వత ప్రయాణానికి సిద్ధపడగా, ఊరి శివాలయంలోని ఒక సాధువు అతనికి సత్యం, సహనం, సమయస్ఫూర్తి అనే గుణాలను తోడుగా తీసుకెళ్లమని చెబుతూ ఒక రాగి తాయత్తును ఇచ్చాడు.

మాయా అడవిలో రాముడిని లోబరుచుకోవడానికి వచ్చిన మాయా యక్షిణిని, ఆమె వెనక్కి తిరిగి ఉన్న పాదాల ఆధారంగా గుర్తించి, తాయత్తు మరియు శివనామస్మరణతో భస్మం చేసి నల్ల కలువ మూలికను పొందాడు. పర్వతం పైభాగంలో పరిచయమైన సోమనాథ్ అనే యువకుడితో కలిసి వజ్రాల గుహ వద్దకు వెళ్లగా, సోమనాథ్ కత్తితో రాముడిని వెన్నుపోటు పొడవబోయాడు. ఆ సోమనాథ్ జమీందారు తమ్ముడని, రాక్షసుడికి బలి ఇవ్వడానికే తనను తెచ్చాడని రాముడు గ్రహించాడు.

గుహ నుండి వెలువడిన 10 అడుగుల భయంకర రాక్షసుడి ముందు రాముడు ధైర్యంగా నిలబడి, తాను స్వార్థంతో రాలేదని, చెల్లెలి ప్రాణాలు, ఊరి ప్రజల కష్టాలు తీర్చడానికే వచ్చానని చెప్పాడు. రాముడి నిజాయితీకి ప్రసన్నుడైన ఆ రాక్షసుడు శాపవిముక్తి పొంది స్వర్ణపురి పూర్వ రాజు రుద్రదేవుడిగా మారాడు. అది వినకుండా దురాశతో నాగమాణిక్యాన్ని పట్టుకున్న సోమనాథ్ వెంటనే రాతి విగ్రహంగా మారిపోయాడు.

రుద్రదేవుడు రాముడికి నిజమైన నిధుల సంచిని, నాగమాణిక్యాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. రాముడు మూలికతో చెల్లెలి ప్రాణాలు కాపాడాడు. రాముడిని బంధించడానికి వచ్చిన జమీందారు ధర్మరాజు అక్రమాలను నాగమాణిక్య దివ్యకాంతితో ప్రజలందరికీ కనిపించేలా చేశాడు. శంఖనాదంతో ప్రత్యక్షమైన రాజా రుద్రదేవుడు జమీందారును కారాగారంలో బంధించి, రాముడిని రాజ్యానికి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేశాడు. ఆ నిధులతో ఊరి ప్రజల అప్పులన్నీ తీర్చి ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించారు.

కథ నీతి: సంపద ఉన్నచోట దురాశ మృత్యువై వెంటాడుతుంది. కానీ సత్యం, త్యాగం, పరోపకారం ఉన్నచోట ఆ సంపదే దైవానుగ్రహమై ధర్మాన్ని నిలబెడుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..