
తిరుమల ఘాట్ రోడ్డులో పడిపోయిన పెళ్లివారి బ్యాగు
రూ.30 లక్షలకు పైగా విలువైన నగదు, బంగారం, ఆస్తి పత్రాలు అప్పగింత
తిరుమల ఘాట్ రోడ్డులో ఓ గుర్తు తెలియని వ్యక్తి చూపిన నిజాయతీ.. ఓ పెళ్లి కుటుంబానికి ఎంతో మేలు చేసింది. పెళ్లి కోసం తీసుకెళ్తున్న బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తి పత్రాలతో కూడిన బ్యాగ్ ఘాట్ రోడ్డులో జారిపడగా.. దానిని గుర్తించిన ఓ ద్విచక్ర వాహనదారుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులకు అప్పగించాడు. అంతేకాదు.. తన వివరాలు కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఘాట్ రోడ్డులో పడిపోయిన బంగారం, డబ్బుల బ్యాగు:
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన లక్ష్మీనారాయణ కుటుంబం, శైలజ కుటుంబాలకు చెందిన వధూవరులకు తిరుమలలోని కల్యాణ వేదికలో శుక్రవారం (ఆగస్టు 28న) సాయంత్రం వివాహం జరిగింది. పెళ్లికి హాజరయ్యేందుకు ఇరు కుటుంబాల సభ్యులు తెల్లవారుజామున రెండు జీపుల్లో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర జీపుపై ఉంచిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగు.. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు ఎక్కడో కిందపడిపోయింది. కొద్దిసేపటి తర్వాత అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఆ బ్యాగు కనిపించింది. బ్యాగును తీసుకున్న ఆయన.. నేరుగా తిరుమల జీఎన్సీ టోల్ గేట్ వద్ద విధుల్లో ఉన్న హోంగార్డు రెడ్డప్పరావుకు అప్పగించారు. తన పేరు, వివరాలు కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
లక్షల రూపాయల విలువైన సొత్తు:
ఇదిలా ఉండగా.. జీపుపై బ్యాగు కనిపించకపోవడంతో పెళ్లి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తిరుమల పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అధికారులు వారిని సెక్టార్-3 సీసీటీవీ వద్దకు పంపించారు. అక్కడ బాధితులు బ్యాగులో ఉన్న వస్తువుల వివరాలను అధికారులకు తెలిపారు. బ్యాగులో ఉన్న వివరాలు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలతో సరిపోలడంతో.. బ్యాగు వారిదేనని అధికారులు నిర్ధారించారు. ఆ బ్యాగులో పెళ్లి కుమార్తెకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల విలువైన 61 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,02,840 నగదు, మరో రూ.10 లక్షల విలువైన ఆస్తి పత్రాలు ఉన్నాయి. మొత్తంగా లక్షల రూపాయల విలువైన సొత్తు తిరిగి దక్కడంతో పెళ్లి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ : దళితులు గుళ్లకు పోతే… బీజేపీ గుళ్లు శుద్ధి చేస్తోంది..
డబ్బు, బంగారాన్ని తెచ్చి ఇచ్చిన తెలియని వ్యక్తి:
టీటీడీ ఏవీఎస్వో కృష్ణయ్య సమక్షంలో.. విలువైన వస్తువులతో కూడిన బ్యాగును అధికారులు పెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ ఇంత విలువైన బ్యాగును ఎలాంటి స్వార్థం లేకుండా అధికారులకు అప్పగించిన ఆ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి నిజాయతీకి పెళ్లి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ నిజాయతీపరుడిని గుర్తించేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం, పెళ్లి కుటుంబ సభ్యులు రాత్రి వరకు ఆరా తీశారు. డబ్బు, బంగారం కనిపిస్తే ఆశపడే రోజుల్లో, లక్షల రూపాయల విలువైన సొత్తును ఏమాత్రం ఆశించకుండా తిరిగి అప్పగించిన ఆ గుర్తు తెలియని వ్యక్తి నిజాయతీ.. నిజంగా వెలకట్టలేని ఆభరణమే..!