Reading Time: 2 minutes

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే అది తప్పనిసరి…ఏజెంట్ల పప్పులు ఉడకవు..!

Caption of Image.
  • పాఠం వింటేనే డ్రైవింగ్​ లైసెన్స్
  • అప్లికెంట్లకు ఆర్టీఏ కార్యాలయాల్లో వీడియో లెస్సన్స్​ 
  • రోడ్డు భద్రతపై అవగాహన 
  • ట్రాక్​ టెస్ట్​లో పాసైతేనే లైసెన్స్​ మంజూరు
  • ప్రయోగాత్మకంగా కూకట్​పల్లి ఆర్టీఏలో అమలు 
  • తర్వాత అన్ని జోనల్​ ఆఫీసుల్లో అమలుకు నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాహనాల డ్రైవింగ్​ లైసెన్స్​ పొందేందుకు ఆర్టీఏ అధికారులు కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్​ రూల్స్​పై పూర్తి అవగాహన కల్పించాకే లైసెన్స్​ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం లైసెన్స్​ దరఖాస్తుదారులకు ముందుగా వీడియో పాఠాలు బోధించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలో అనేక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

మధ్యవర్తుల ప్రమేయం, కొందరు ఆఫీసర్ల అవినీతి కారణంగా డ్రైవింగ్​ టెస్ట్​ లేకుండానే పర్మినెంట్​ లైసెన్స్​లు మంజూరవుతున్నట్లు గ్రహించారు. దీంతో గ్రేటర్​ పరిధిలోని ఆయా జోనల్​ కార్యాలయాల్లో లైసెన్స్​ జారీలో కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం కూకట్​పల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఆ నిబంధనను అమలుచేసేందుకు సిద్ధమయ్యారు. పర్మినెంట్​ లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు. ఇక్కడ సక్సెస్​ అయితే మిగిలిన అన్ని జోనల్​ కార్యాలయాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. 

మూడు గంటల వీడియో..

సాధారణంగా డ్రైవింగ్​ లైసెన్​ తీసుకోవాలంటే  ముందు లెర్నింగ్​ లైసెన్స్​కు దరఖాస్తు చేసుకుని అక్కడ జరిగే చిన్న టెస్ట్​లో పాస్​ అవ్వాల్సి ఉంటుంది. లెర్నింగ్​ లైసెన్స్​ తీసుకున్న 30 రోజుల నుంచి 6 నెలల్లో పర్మినెంట్​ లైసెన్స్​కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. పర్మినెంట్​ లైసెన్స్​కు దరఖాస్తు చేసుకున్న వారు ఆర్టీఏ కార్యాలయంలో 3 గంటల వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ పాఠాలకు హాజరైన వారిని మాత్రమే ట్రాక్​ టెస్ట్​లకు అనుమతిస్తారు. ప్రస్తుతం నాగోల్​, కొండాపూర్​, ఉప్పల్​, మేడ్చల్​, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాక్​ టెస్ట్​లను నిర్వహిస్తున్నారు. 

ఈ టెస్ట్​లో ఉత్తీర్ణులైతేనే పర్మినెంట్​ లైసెన్స్​ జారీ చేస్తారు. అంటే లెర్నింగ్​ లైసెన్స్​ తీసుకున్న వారు పర్మినెంట్​ లైసెన్​కు దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా మూడు గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిందే. ఆ తరువాతే డ్రైవింగ్​ టెస్ట్​కు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

టీజీ ఆన్​లైన్​లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యుల్స్​ ఉన్నాయి. ఆన్​లైన్​లో పాఠాలను వింటున్న సమయంలో అప్లికెంట్ల ముఖకవళికలు కూడా నమోదు చేస్తారు. తద్వారా వారికి ట్రాక్​ టెస్ట్​కు అనుమతిస్తారు. డ్రైవింగ్​ లైసెన్స్​ తీసుకునేవారికి తప్పనిసరిగా రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ విధానం అమలులోకి తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.