
Vem Narender Reddy: మహబూబాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ శిబిరంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే వారానికి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
వచ్చే డిసెంబర్‌లో మరోసారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీని మూడు విడతల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడంలో వెనుకంజలో ఉందని వేం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమవాళ్లు కొంత వెనుకబడ్డారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన అనేక ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. చివరకు జిరాక్స్ సెంటర్లలో కూడా ప్రశ్నపత్రాలు లభించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.