
- ప్రభుత్వాన్ని కోరిన ఆర్ యూపీపీ నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2010 సంవత్సరానికి ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ (ఆర్‌యూపీపీ) రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సిములు ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడు తరహాలో తెలంగాణ శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ఆ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నర్సిములు మాట్లాడుతూ రాష్ట్రంలో టెట్ కోసం సిద్ధమవుతున్న సుమారు 21 వేల మంది సీనియర్ టీచర్లకు ఈ నిబంధన తీవ్ర మానసిక ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ పేపర్-2లో సబ్జెక్టుతో సంబంధం లేని అంశాలు కాకుండా, టీచర్లు చెప్తున్న సబ్జెక్టుకే అనుగుణంగా పరీక్ష నిర్వహించేలా శాస్త్రీయ మార్పులు చేయాలని, కేటగిరీల వారీగా పాస్ పర్సంటేజీలను పునర్ పరిశీలించాలని కోరారు. అనంతరం మంత్రి స్పందిస్తూ.. ఈ విషయాన్ని వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు సంఘం నేతలు తెలిపారు.