
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మేళ్లచెరువు మండలంలోని ఎర్రగట్టు తండాలో శనివారం (ఆగస్ట్ 29) ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో వేప చెట్టు విషయంలో గత 25 సంవత్సరాలుగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. శనివారం (ఆగస్ట్ 29) కూడా ఇదే విషయంలో రెండు గ్రూపుల మధ్య మరోసారి గొడవ జరిగింది. వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భూక్య రాము అనే వ్యక్తి అమరబోయిన వెంకటేశ్వర్లు, భూక్య సైదను గొడ్డలితో నరికాడు.
తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. గొడ్డళ్లు, రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఎర్రగుట్టు తండాలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేళ్లచెరువు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో మేళ్లచెరువు ఎస్ఐ నవీన్ గాయపడ్డారు. రాళ్ల దాడిలో ఆయన తలకు గాయమైంది. పోలీస్ సిబ్బంది వెంటనే ఎస్ఐను హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి దారుణ హత్యతో ఎర్రగట్టు తండాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా తండాలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.