
Karnataka: కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కీలక పరిణామం ఎదురైంది. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రకటిస్తూ.. తన పై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధమని చెప్పారు. వాల్మీకి కార్పొరేషన్ లావాదేవీల్లో ఎక్కడైనా తన సంతకం ఉందా.? అంటూ ప్రశ్నించారు. తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాలు ప్రతీ రోజు తనపై వెయ్యి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకుల ప్రమేయం ఉందని, ఒక వేళ బ్యాంకుల ప్రమేయం ఉంటే దానికి కేంద్ర ఆర్థిక మంత్రి బాధ్యత వహించరా? అని ప్రశ్నించారు. మరోవైపు, బీజేపీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ స్కామ్‌పై ఒత్తిడి పెరిగింది. బీజేపీ పెద్ద పాదయాత్రను ప్రకటించింది. దీనికి ముందే నాగేంద్ర తన రాజీనామాను సమర్పించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్‌కు షాక్ లాంటిదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2024 మేలో కార్పొరేషన్ అకౌంటింగ్ సూపరింటెండెంట్ పి. చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత, రూ.89.63 కోట్ల విలువైన అనధికార లావాదేవీల కేసు వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర, 2024 జూన్‌లో రాజీనామా చేశారు. 2026 ఆగస్టు 3న, ఆయనను ప్రణాళిక, గణాంకాల శాఖతో క్యాబినెట్‌లో తిరిగి నియమించారు. దీని తర్వాత బీజేపీ, జేడీఎస్ పార్టీలు నాగేంద్ర రాజీనామాను డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు సెప్టెంబర్ 1 నుండి 10 వరకు రాయచూర్ నుండి బళ్లారి వరకు పాదయాత్రను కూడా ప్రకటించాయి. పరిస్థితిని గ్రహించిన సీఎం డీకే శివకుమార్, నాగేంద్ర రాజీనామాను కోరారు.