Reading Time: < 1 minute

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి.. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ రివ్యూ మీటింగ్

Caption of Image.

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జయశంకర్​భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎంపీడీవో, ఏఈ, మున్సిపాలిటీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 4,562 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 851 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. 

వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను స్పీడప్​ చేయాలని, ముఖ్యంగా ఆర్సీసీ, రూఫ్ లెవెల్ దశల్లో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. భూపాలపల్లి మండలంలో అదనంగా 200 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు, భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 1,100 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. 

మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాని ఇండ్ల విషయంలో నిధుల సమస్య, లబ్ధిదారుల అనాసక్తి, సాంకేతిక లేదా ఇతర కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీవో బాలకృష్ణ, పీఆర్ ఈఈ విద్యా సాగర్, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.