Reading Time: 2 minutes
Hisense A10 E Ink Phones Launched With Detachable Color Screen And Android 16

Hisense A10 e-ink: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైసెన్స్ (Hisense) సరికొత్త కాన్సెప్ట్‌తో రెండు ఈ-ఇంక్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. Hisense A10 Pro, A10 Ultra పేర్లతో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్లలో పేపర్‌లా కనిపించే ఈ-ఇంక్ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు ప్రత్యేకమైన డిటాచబుల్ కలర్ స్క్రీన్‌ను అమర్చుకుని సాధారణ కలర్ స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

ప్రత్యేకమైన ఈ-ఇంక్ డిస్‌ప్లే:

Hisense A10 సిరీస్‌లో 6.13 అంగుళాల Carta 1300 e-ink డిస్‌ప్లే ఉంది. ఇది 1648×824 పిక్సెల్స్ రిజల్యూషన్, 300 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఈ స్క్రీన్ 256 గ్రేస్కేల్ లెవల్స్‌తో పాటు 36 డ్యూయల్-కలర్ ఫ్రంట్ లైటింగ్ లెవల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలతో పోలిస్తే ఈ-ఇంక్ స్క్రీన్ పేపర్‌లాంటి రీడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో ఫ్లికర్, బ్లూ లైట్ వంటి సమస్యలు లేకపోవడంతో ఈ-బుక్స్ చదవడం, పీడీఎఫ్‌లను పరిశీలించడం, నోట్స్ తయారు చేసుకోవడం, చదువుకోవడం వంటి పనులకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. డిస్‌ప్లే రిఫ్రెష్‌ను నిర్వహించేందుకు E Ink T2000 హార్డ్‌వేర్ టీసీఓఎన్ చిప్‌ను కూడా ఇందులో ఉపయోగించారు.

అవసరమైనప్పుడు కలర్ స్క్రీన్‌..

A10 సిరీస్‌లో అసలు ప్రత్యేకత డిటాచబుల్ కలర్ స్క్రీన్. 4.96 అంగుళాల ఎల్‌సీడీ కలర్ డిస్‌ప్లేను ప్రత్యేకమైన మాగ్నెటిక్ రింగ్, మెటల్ కాంటాక్ట్స్ ద్వారా ఫోన్ వెనుక భాగంలో అమర్చుకోవచ్చు. ఈ స్క్రీన్‌ను అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు.. అవసరం లేనప్పుడు తొలగించుకోవచ్చు. ఈ కలర్ స్క్రీన్‌ను అమర్చిన తర్వాత ఫోన్‌ను సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. కలర్ కామిక్స్ చూడటం, ఫొటోలు, చార్ట్స్, చిన్న వీడియోలు చూడటం, సోషల్ మీడియా యాప్స్ వినియోగించడం వంటి పనులు చేసుకోవచ్చు. A10 Ultra బాక్స్‌లోనే ఈ మాగ్నెటిక్ కలర్ స్క్రీన్ లభిస్తుంది. అయితే A10 Proలో మాగ్నెటిక్ కాంటాక్ట్స్ ఫోన్‌లోనే ఉన్నప్పటికీ కలర్ స్క్రీన్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ప్రాసెసర్‌ & బ్యాటరీ:

ఈ రెండు ఫోన్లలో 4nm ప్రాసెస్‌పై తయారైన Qualcomm QCM6690 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ-ఇంక్ డిస్‌ప్లే వినియోగానికి అనుగుణంగా పవర్ మేనేజ్మెంట్‌ను ఆప్టిమైజ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సాధారణ రీడింగ్ సమయంలో ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీ, పవర్ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా తగ్గించి బ్యాటరీని ఆదా చేస్తుంది. ఎక్కువ పనిభారం ఉన్నప్పుడు మాత్రం మెరుగైన పనితీరు కోసం పవర్‌ను పెంచుతుంది. ఈ కొత్త A10 సిరీస్‌లో 4000mAh బ్యాటరీ ఉంది. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. A10 Ultraలో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

కెమెరా:

ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. NFC, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, Wi-Fi 6, కాల్ రికార్డింగ్, యాప్ క్లోనింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. A10 సిరీస్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. సాధారణ ఈ-ఇంక్ ఫోన్లలో ఉండే యాప్ పరిమితులు ఇందులో లేవు. యూజర్లు సాధారణ ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను ఎక్కువకాలం అందించేందుకు ఫోన్ అర్హత ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ధర:

రెండు మోడళ్లు మూన్ వైట్, బాంబో గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ప్రస్తుతం Hisense A10 Pro, A10 Ultra చైనా మార్కెట్‌లో మాత్రమే విడుదలయ్యాయి. ఈ ఫోన్లను భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. Hisense A10 Pro మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి.

* 8GB + 128GB: 2,799 యువాన్ (సుమారు రూ.39,700).
* 8GB + 256GB: 2,999 యువాన్ (సుమారు రూ.42,500).
* 12GB + 512GB: 3,499 యువాన్ (సుమారు రూ.49,700).

A10 Ultra ధరలు ఇలా ఉన్నాయి..

8GB + 128GB: 3,198 యువాన్ (సుమారు రూ.45,400).
8GB + 256GB: 3,398 యువాన్ (సుమారు రూ.48,000).
12GB + 512GB: 3,898 యువాన్ (సుమారు రూ.55,300).