మన పూర్వీకులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా చిరుధాన్యాలతో (Millets) చేసే ఆహార పదార్థాలు శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది రాగి జావ లేదా రాగి అంబలి.. రెండు స్పూన్ల రాగి పిండి, 1 గ్లాసు నీళ్లు, 1 కప్పు చిక్కటి మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. ఉంటే సరిపోతుంది.
నీటిని మరిగించడం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రలో 1 గ్లాసు నీరు పోయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగే లోపు, ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి స్పూన్‌తో ఉండలు (lumps) లేకుండా బాగా కలుపుకోవాలి.
జావ ఉడికించడం: మరుగుతున్న నీటిలో ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేస్తూ గరిటెతో బాగా తిప్పాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, జావ చిక్కబడే వరకు సుమారు 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. జావ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, జావపై మీగడ కట్టకుండా ఉండటానికి గరిటెతో తిప్పుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. మరొక గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకొని, మజ్జిగ కవ్వంతో చిలికి చిక్కటి మజ్జిగను తయారు చేసుకోవాలి. జావ పూర్తిగా చల్లారిన తర్వాత, ఈ మజ్జిగను అందులో పోసి బాగా కలుపుకోవాలి. రుచి చూసి అవసరమైతే మరికొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు. సిద్ధమైన రాగి జావను గ్లాసుల్లోకి తీసుకొని నేరుగా తాగవచ్చు.. లేదా పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు చల్లుకొని తాగావచ్చు.
రాగి జావ ప్రయోజనాలు: రాగులలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను, పళ్లను దృఢంగా ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఈ జావ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచి పోషకాలను అందిస్తుంది.




