
జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. పెద్ద వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు విధానాన్ని ఆటోమేట్ చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఒక రోజు ముందు.. అంటే సెప్టెంబర్ 11న అధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యాలయ మెమోరాండం జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్.. ఏడాది విరామం తర్వాత సమావేశం కానుంది.
ఏడాది తర్వాత భేటీ
జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం 2025 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగింది. ఆ సమావేశంలో వస్తు సేవల పన్ను (GST) రేట్లు, శ్లాబ్‌లలో భారీ మార్పులకు కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 2025 సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రెండు ప్రధాన శ్లాబ్‌లుగా 5 శాతం, 18 శాతంగా మారింది. అత్యంత విలాసవంతమైన వస్తువులు, పాపపు వస్తువులకు (Sin Goods) మాత్రమే 40 శాతం అత్యధిక రేటును నిర్ణయించారు. అంతకుముందు 2017 జూలై 1 నుంచి అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం నాలుగు శ్లాబ్‌ల స్థానంలో ఈ కొత్త విధానం తీసుకొచ్చారు.
రిజిస్ట్రేషన్ సులభతరం?
సెప్టెంబర్ 12న జరగనున్న 57వ సమావేశంలో నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను బదిలీ చేసే వ్యాపారాల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే అంశాన్ని కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను బదిలీ చేసే పెద్ద వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇచ్చే విధానంలో కేంద్ర జీఎస్టీ విభాగాలు, వివిధ రాష్ట్రాల విభాగాల మధ్య ఏకరూపత లేదు. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో అనిశ్చితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకరించే ప్రతిపాదనను కౌన్సిల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలో ఆటోమేషన్‌తో పాటు ఇతర మార్పులపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు కొత్త విధానాలను పరిశీలించనున్నట్లు సమాచారం.
చిన్న వ్యాపారాలకు..
చిన్న, తక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల కోసం సరళీకృత జీఎస్టీ రిజిస్ట్రేషన్ విధానాన్ని 2025 సెప్టెంబర్‌లో జరిగిన 56వ కౌన్సిల్ సమావేశంలోనే ఆమోదించారు. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ వ్యవస్థ డేటా విశ్లేషణ ఆధారంగా గుర్తించిన చిన్న, తక్కువ రిస్క్ వ్యాపారాలు లేదా తమ నెలవారీ అవుట్‌పుట్ పన్ను బాధ్యత రూ.2.5 లక్షలకు మించదని స్వీయ అంచనా వేసుకున్న వ్యాపారాలు ఈ సరళీకృత విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో CGST, SGST/UTGST, IGST అన్నీ కలిపి పన్ను బాధ్యతను లెక్కిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1.68 కోట్ల వ్యాపారాలు జీఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి.