Reading Time: 2 minutes
Nagarjuna To Play Villain In H Vinoths Action Entertainer Suriya 49

Suriya 49: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో ‘సూర్య 49’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోద్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫీషియల్ గా ప్రకటన మాత్రం రాలేదు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘సూర్య 49’లో సూర్యకు ధీటుగా విలన్ పాత్రను దర్శకుడు హెచ్. వినోద్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారని, ఆయనకు కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. నాగార్జునలాంటి సీనియర్ స్టార్ ఇందులో భాగమైతే సినిమాకు తమిళంతో పాటు తెలుగు మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే చర్చలు ఇంకా పూర్తిగా ముగియలేదని, అందుకే మేకర్స్ అధికారికంగా నాగార్జున పేరును ప్రకటించలేదని తెలుస్తోంది.

నాగార్జున విలన్‌గా నటిస్తారనే వార్తపై అభిమానుల్లో మాత్రం భిన్నమైన స్పందన కనిపిస్తోంది. గతేడాది రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ, పాత్రకు తగినంత బలం లేదని కొందరు అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జున స్థాయి హీరోకు మరింత పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండాల్సిందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన విలన్ పాత్రలో కనిపిస్తారనే వార్త రావడంతో, ఈసారి అయినా పవర్ ఫుల్ రోల్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ‘డీసీ’ ఫేమ్ వామికా గబ్బిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సూర్య, నాగార్జున, వామికా గబ్బి కాంబినేషన్ నిజమైతే ఈ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది. ‘సూర్య 49’ను సూర్య, జ్యోతికలకు చెందిన జాగరం స్టూడియోస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కథ, నటీనటుల ఎంపిక, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ‘కింగ్ 100’తో బిజీగా ఉన్నారు. ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టబు, సుష్మిత భట్, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆయన 47వ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ దీపావళికి విడుదల కానుంది. అలాగే ‘జై భీమ్’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌తోనూ సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హెచ్. వినోద్ సినిమాకంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక సూర్య 49లో నాగార్జున నటించనున్నారనే వార్త నిజమైతే మాత్రం  ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకుంటున్నారు అభిమానులు.