
Sri Lanka vs ICC: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC)కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి తరలించడానికి ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్వహణలో పదే పదే లంక ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం. దీంతో ఈ మెగా టోర్నమెంట్‌ను శ్రీలంక నుంచి మరో దేశానికి తరలించనున్నారు.
ప్రభుత్వ జోక్యమే ముంచేసింది:
శ్రీలంక క్రికెట్ బోర్డు పాలనా వ్యవహారాలను ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన ట్రాన్స్‌ఫార్మేషన్ కమిటీ పర్యవేక్షిస్తోంది. క్రికెట్ బోర్డులు సర్కార్ నుంచి స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారా మాత్రమే పనిచేయాలని ఐసీసీ స్పష్టమైన నియమం విధించినప్పటికీ లంక గవర్నమెంట్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దాంతో ఆతిథ్య హక్కులు చేజారిన విషయాన్ని కమిటీ కార్యదర్శి ప్రకాష్ షాఫ్టర్ ధృవీకరించారు. ఈ టోర్నీని ఏ దేశంలో నిర్వహించాలనేది ఐసీసీ తదుపరి బోర్డు సమావేశంలో ఫిక్స్ చేయనుంది.
గతంలోనూ ఇలాంటి ఘటన.. లంకకు భారీ ఆర్థిక నష్టం:
ఐసీసీ నుంచి శ్రీలంకకు ఇలాంటి షాక్ తగలడం ఇదే తొలిసారి కాదు. 2023లోనూ ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ, 2024 పురుషుల అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను రద్దు చేసి దక్షిణాఫ్రికాకు బదిలీ చేసింది. ఇప్పుడు మరోసారి ప్రసిద్ధ టోర్నీని చేజార్చుకోవడంతో లంక క్రికెట్ బోర్డుకు కోట్ల రూపాయల ఆతిథ్య ఆదాయం కోల్పోవడంతో పాటు అక్కడి హోటళ్లు, పర్యాటక, వ్యాపార రంగాలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
టోర్నీలో లంక జట్టు అర్హతపై తీవ్ర అనిశ్చితి:
ఆతిథ్య హక్కులు కోల్పోవడంతో పాటు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక మహిళల జట్టు అసలు ఆడుతుందా లేదా అనేదానిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంకకు నేరుగా అర్హత దక్కాల్సి ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే/టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆతిథ్యం మరో దేశానికి మారితే, శ్రీలంకకు టోర్నీలో స్థానం దక్కుతుందో లేదో ఐసీసీ విడుదల చేసే కొత్త అర్హత నిబంధనలపై ఆధారపడి ఉంది.