Reading Time: < 1 minute
Chandrababu Jagan Local Body Elections Polavaram Veligonda

అమరావతిలోని సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో ఒక విధంగా అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే మార్కాపురంను నూతన జిల్లాగా ప్రకటించడమే కాకుండా, ఆ ప్రాంతాన్ని వ్యవసాయపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా మార్కాపురం జిల్లాను ప్రతిష్టాత్మక హార్టీకల్చర్ హబ్‌లో చేర్చామని సీఎం చంద్రబాబు వివరించారు.

సెప్టెంబర్ 2న పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు జలహారతి

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్‌కు అధికారికంగా ‘జలహారతి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపడుతూ పంటలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా సంక్షేమం, అభివృద్ధి , ప్రాజెక్టుల పూర్తి దిశగా తమ కూటమి ప్రభుత్వం తగ్గేదేలేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.