
Neeraj Chopra: ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత జెండాను రెపరెపలాడించిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడిప్పుడే పాత ఫామ్‌ను అందుకని ఈటెను సరికొత్త ఎత్తులకు విసురుతున్న వేళ, తీవ్ర గాయం రూపంలో దురదృష్టం అతడిని వెంటాడింది. ప్రాక్టీస్ సమయంలో మడమ (అంకిల్) లిగమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో, 2026 మిగిలిన క్రీడా సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. దీంతో త్వరలో జరగబోయే అత్యంత కీలకమైన ఆసియా గేమ్స్, డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఆడటం లేదు.
ఇన్స్టాగ్రామ్‌లో నీరజ్ భావోద్వేగం:
తాజా గాయంపై నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన బాధను పంచుకున్నాడు. ఎంతో కష్టపడి లాసాన్ డైమండ్ లీగ్‌లో నా సీజన్ బెస్ట్ త్రో విసిరాను.. మళ్లీ పాత లయ దొరికిందని సంతోషించేలోపే, ప్రాక్టీస్ లో మడమ లిగమెంట్ చిరిగిపోయింది. డాక్టర్లు, నా సపోర్ట్ స్టాఫ్‌తో చర్చించిన తర్వాత ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా.. మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న సమయంలోనే ఇలా జరగడం నిరాశగా ఉన్నా.. ఇవన్నీ అథ్లెట్ ప్రయాణంలో భాగమే.. త్వరగా కోలుకుని మళ్లీ బలంగా తిరిగి రావడమే నా ముందున్న ఏకైక లక్ష్యమని ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
9 సెంటీమీటర్లతో మిస్సయిన గోల్డ్:
గాయపడటానికి కొద్దిరోజుల ముందే స్విట్జర్లాండ్‌లోని లాసాన్ డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ సీజన్ బెస్ట్ త్రో (88.05 మీటర్లు) విసిరి రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే (88.14 మీటర్లు) కంటే కేవలం 9 సెంటీమీటర్ల తేడాతో పసిడి పతకం మిస్సయినప్పటికీ, నీరజ్ ప్రదర్శన అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురింపజేసింది. 2026 సీజన్ ఆరంభంలో దోహా డైమండ్ లీగ్‌లో 4వ స్థానం, కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ సాధించినా.. 86 మీటర్ల మార్కును దాటలేకపోయాడు. లాసాన్‌లో 88.05 మీటర్లు విసిరి మళ్లీ ట్రాక్‌లోకి వస్తున్న సమయంలో ఈ ఇంజ్యూరీ కావడం క్రీడాభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.
ఇండియన్ అథ్లెటిక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ:
2021 టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచి భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా లేకపోవడం రాబోయే ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల రేసుపై పెద్ద దెబ్బ కొట్టినట్లయింది. కానీ చాంపియన్లు ఎప్పుడూ గాయాల నుంచి మరింత బలంగా పుంజుకుంటారని, నీరజ్ చోప్రా కూడా త్వరలోనే ఫుల్ ఫిట్‌నెస్‌తో రీ-ఎంట్రీ ఇచ్చి మళ్లీ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.