Reading Time: 2 minutes

కేజ్రీవాల్‌కే షాక్ ఇచ్చిన మాజీ శిష్యుడు.. ప్రధాని రేసులో దూసుకెళ్తున్న దీప్కే

Caption of Image.

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ విషయంలో తన మాజీ బాస్ కేజ్రీవాల్‎ను అధిగమించి ఈ సారి దీప్కే హెడ్ లైన్స్‎లో నిలిచారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీజేపీ ఫౌండర్ తన గురువును వెనక్కి నెట్టడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరీ అభిజిత్ దీప్కే ఏ విషయంలో కేజ్రీవాల్‎ను అధిగమించారో తెలుసుకుందాం.. 

తదుపరి భారత ప్రధానిగా ఎవరైతే బెస్ట్ అంటూ 2026, ఆగస్ట్‎లో ఇండియా టుడే – సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వేలో సంచలన ఫలితాలు నమోదు అయ్యాయి. ఈ సర్వేలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ 48.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 27.1 శాతం మద్దతుతో సెకండ్ ప్లేస్‎లో ఉన్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీ స్థాపించి కేవలం రెండేళ్లలోనే తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ 9.2 శాతం ఓట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఇక, వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి 2 శాతం మంది ఓట్లేశారు. 

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 1.7 శాతం ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 1.3 శాతం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతం ఓట్లు సాధించారు. దేశ తదుపరి ప్రధాని రేసులో తన మాజీ బాస్ అరవింద్ కేజ్రీవాల్‌ను దీప్కే వెనక్కి నెట్టడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీజేపీ ఏర్పాటు చేసిన కేవలం మూడు నెలల్లోనే దీప్కే కేజ్రీవాల్‎ను అధిగమించడం కొత్త చర్చకు దారి తీసింది. అవినీతి ఆరోపణలతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ గుర్తింపు తగ్గిపోగా.. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం, నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతున్న దీప్కే క్రేజ్ అమాంతం పెరిగిందంటున్నారు విశ్లేషకులు. 

ఆప్‎తో అనుబంధం:

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఏర్పాటుతో దేశవ్యాప్తంగా పాపులరైన అజిదీప్కే గతంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిసి పని చేశారు. ఆప్ సోషల్ మీడియా టీమ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్‌గా సేవలందించారు. మీమ్స్, హాస్యం, వ్యంగ్యం ద్వారా రాజకీయ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలను అమలు చేశారు.

అలాగే, కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఢిల్లీ సీఎంవో కమ్యూనికేషన్ విభాగంలో కూడా పని చేశారు. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికాలో వెళ్లిన దీప్కే ఆప్‎కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2026లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పొలిటికల్ సెటైరికల్ పార్టీ ఏర్పాటు చేశాడు. దేశంలోని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా సీజేపీ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో యువతలో దీప్కేకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.