Reading Time: 2 minutes
Rajinikanth Tharman Ashwath Marimuthu Five Months Shooting Sankranti Release

Ashwath Marimuthu: సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం చూస్తుంటే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు రావడం సహజమే. ఆయన కూడా తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేస్తూ.. వేగంగా రిలీజ్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్‌లో ఓ యంగ్ డైరెక్టర్ రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నాడు. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుకు రజినీకాంత్ స్వయంగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. పలువురు దర్శకుల పేర్లను పరిశీలించిన తర్వాత.. ‘తలైవర్ 173’ బాధ్యతలను అశ్వత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్ పూర్తవగా.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా అశ్వత్ మారిముత్తు ఒక ఇంటర్వ్యూలో తన సినిమా లైనప్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రజినీకాంత్‌తో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన.. ఈ మూవీ షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంటే షూటింగ్ స్టార్ట్ చేసిన ఐదు నెలల్లోనే రజినీకాంత్ వంటి సీనియర్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమాను పూర్తి చేయాలని అశ్వత్ ప్లాన్ చేస్తున్నాడన్నమాట. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ‘ధర్మన్’ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అశ్వత్ మారిముత్తు తన తదుపరి ప్రాజెక్ట్‌ను శింబుతో చేయనున్నాడు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాకంటే ముందే శింబుతో సినిమా చేయాల్సి ఉంది. అయితే శింబు నటిస్తున్న ‘అరసన్’ షూటింగ్ ఆలస్యం కావడంతో.. అశ్వత్ ముందుగా రజినీకాంత్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు అశ్వత్ మారిముత్తు ‘దయానగరం’ అనే సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించనున్నట్లు సమాచారం. మొత్తంగా రజినీకాంత్‌తో పాన్ ఇండియా మూవీని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయాలనే అశ్వత్ ప్లాన్ ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది.