Reading Time: 2 minutes

రైతు డిస్కం బిజినెస్ ప్లాన్‌‌‌‌పై సర్కారు ఫోకస్..సీఎస్ అధ్యక్షతన ఏర్పడిన హై లెవెల్ కమిటీలో చర్చ

Caption of Image.
  •     బిజినెస్  వ్యవహారాలపై రిపోర్ట్ రెడీ చేస్తున్న కమిటీ
  •     3 నెలల్లో రిపోర్ట్ అందించాలని జులై 10న ఈఆర్సీ ఆదేశం
  •     సదరన్, నార్తర్న్ డిస్కమ్‌‌‌‌ల నుంచి ఆస్తులు, అప్పుల పంపకాలకు రెడీ అవుతున్న ఫైల్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  రైతు డిస్కం బిజినెస్ ప్లాన్‌‌‌‌పై  సర్కారు పూర్తిస్థాయిలో ఫోకస్​ చేసింది. ఈ డిస్కంను త్వరితగతిన పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి రైతులకు సేవలందించాలని భావిస్తోంది. ఈ మేరకు చీఫ్​ సెక్రటరీ అధ్యక్షతన నియమించిన హై లెవల్​ కమిటీ నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమైంది. 3 నెలల్లో రిపోర్ట్ అందించాలని జులై 10న ఈఆర్సీ ఇచ్చిన ఆదేశానికి తగ్గట్టుగా కమిటీ పనిచేస్తున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా రైతు డిస్కమ్​ ఆఫీసర్లతో చర్చలు జరిపింది. సదరన్​, నార్తర్న్​ డిస్కమ్‌‌‌‌ల నుంచి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన ఫైల్​ రెడీ చేస్తున్నది. 

3 నెలల్లో రిపోర్ట్..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌‌‌‌కు లైసెన్స్​ మంజూరు చేస్తూ 3 నెలల్లో ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన సమగ్రమైన రిపోర్ట్​ అందించాలని జులై 10న ఈఆర్సీ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం వ్యాపార వ్యవహారాలను చేపట్టాల్సిన రైతు డిస్కమ్‌‌‌‌లో కేవలం 2 వేల మంది ఉద్యోగులను మాత్రమే సర్దుబాటు చేస్తే ఎట్లా? అని ప్రశ్నించింది. ముందుగా ఉద్యోగుల సర్దుబాట్లకు సంబంధించి 3 నెలల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని పేర్కొన్నది. దీంతో ఇది వరకే రైతు డిస్కమ్​ ఆధ్వర్యంలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు బ్రేక్​ పడింది. మొత్తం 2 వేల పోస్టులకుగానూ 2,576 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 511 ఇంజినీర్ పోస్టుల కోసం 1,254 మంది అప్లై చేసుకున్నారు. రైతు డిస్కమ్‌‌‌‌లో పనిచేసే వారికి ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇదే క్రమంలో సదరన్​, నార్తర్న్​ డిస్కమ్‌‌‌‌లు, జెన్​కో, ట్రాన్స్​కో సంస్థల ఉద్యోగుల ప్రమోషన్ల సమస్య వచ్చి పడింది. దీంతో ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి హై లెవెల్​ కమిటీ పూర్తి స్థాయిలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. 

బిజినెస్  వ్యవహారాలపై సిద్ధమవుతున్న రిపోర్ట్ 

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో డిస్కమ్‌‌‌‌లకు రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు పేరుకుపోయాయి. ఈ అప్పులను సర్దుబాటు చేయడంతోపాటు వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లను, ఎల్‌‌‌‌టీ లైన్లు, వ్యవసాయ ఫీడర్లు, సబ్​ స్టేషన్లను పాత డిస్కమ్‌‌‌‌ల నుంచి కొత్త డిస్కమ్‌‌‌‌లోకి అధికారికంగా బదిలీ చేయాల్సి ఉన్నది. ఆస్తుల విభజన, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ) ప్రక్రియకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 2,232 ప్రత్యేక సర్వే బృందాల సహాయంతో డీటీఆర్‌‌‌‌‌‌‌‌లు, వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్లను మ్యాపింగ్​చేసింది. విద్యుత్ వ్యాపార నిర్వహణలో రైతు డిస్కమ్ వాటా 42 శాతంగా తేలింది. – సదరన్​ డిస్కమ్​ వాటా 71 నుంచి 45 శాతానికి, నార్తర్న్​ డిస్కమ్​ వాటా 29  నుంచి 13 శాతానికి పడిపోయింది. ఈ లెక్కల ఆధారంగా 3 డిస్కమ్‌‌‌‌ల మధ్య బిజినెస్​ వ్యవహారాలపై హై లెవెల్​ కమిటీ స్టడీ రిపోర్ట్​ రెడీ చేస్తున్నది. ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపింది. మరికొద్ది రోజుల్లో డిటైల్డ్​ రిపోర్ట్​ తయారు చేసి ఈఆర్సీకి సమర్పించనున్నది.   

ఆగిన ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 

రాష్ట్రంలో పనిచేస్తున్న 50 వేల మందికిపైగా విద్యుత్​ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం జాయింట్​ యాక్షన్​ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టడానికి రెడీ అయ్యారు. పలు దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్​ సౌద ముందు భారీ ధర్నా కూడా చేపట్టారు. జిల్లాలవారీగా రిలే నిరాహార దీక్షలు చేపట్టానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విద్యుత్​ శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ఆధ్వర్యంలో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. పూర్తిస్థాయిలో రైతు డిస్కమ్​ఏర్పాటు చేసిన తర్వాతే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలను విరమించుకున్నట్టుగా ప్రకటించారు

©️ VIL Media Pvt Ltd.