Reading Time: < 1 minute
ఎంఐఎం MLC మిర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ

మజ్లిస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. వెంటనే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ పరిణామం ఓల్డ్ సిటీలో తీవ్ర చర్చకు దారితీసింది. రహ్మత్ బేగ్‌పై ఇంత కఠిన చర్య ఎందుకు తీసుకున్నారన్నది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. అసలు కారణాన్ని మాత్రం ఎంఐఎం వెల్లడించలేదు. దీంతో ఆయనపై చర్యకు దారితీసిన అంశం ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

సౌదీ నుంచి అత్యవసరంగా హైదరాబాద్‌కు?

రహ్మత్ బేగ్ గురువారం ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పార్టీ అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతరం అదే రోజు సాయంత్రం ఆయనను తిరిగి హైదరాబాద్‌కు రప్పించినట్లు తెలుస్తోంది. ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ఆయనను సౌదీ నుంచి అత్యవసరంగా ఎందుకు పిలిపించారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు.

ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా?

పార్టీ ఆదేశాల మేరకు రహ్మత్ బేగ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్‌కు సమర్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా? లేక పార్టీ ఆదేశాలను పాటించి వెంటనే పదవి నుంచి తప్పుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామానికి రెండు రోజుల క్రితం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అనే తేడా లేకుండా తప్పు చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాతే రహ్మత్ బేగ్‌పై బహిష్కరణ వేటు పడటంతో రెండు పరిణామాలకు సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సంబంధాన్ని పార్టీ ప్రకటించలేదు.