Reading Time: < 1 minute
Veligonda Displaced Families Compensation Chandrababu Orders

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కూడిన సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల భూములు, ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గెజిట్ నోటిఫికేషన్, సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాకపోయినా, అలాగే అవార్డు పాస్ కాని అర్హులైన యువతకు కూడా పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టుల నిర్మాణంలో త్యాగం చేసిన నిర్వాసితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని, మరే ప్రాజెక్టులోనూ లేనివిధంగా ఇక్కడ భరోసా కల్పించాలని సీఎం ఆదేశించారు.

రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా.. 1,800 పిటిషన్ల పరిష్కారం

ముఖ్యమంత్రి సూచనల మేరకు కటాఫ్ డేట్ దాటినప్పటికీ అర్హులైన వారి కోసం రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019 కటాఫ్ డేట్ నుండి 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు కూడా రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నారు. అర్హుల జాబితాలో తమ పేర్లను చేర్చాలని ప్రభుత్వానికి వచ్చిన దాదాపు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఈ పిటిషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవాల్టి నుంచే ఎక్స్ గ్రేషియా అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ఆగస్టు 31న వెలిగొండకు నీళ్లు.. నిర్వాసిత కాలనీల్లో సౌకర్యాలు

ఈ ప్రాజెక్టు పురోగతిపై వివరాలు వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు, రాబోయే ఆగస్టు 31 నాటికి వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేయడంతో పాటు చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు ఈ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిర్వాసిత కాలనీలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేసి వారికి మెరుగైన జీవనాన్ని అందిస్తామన్నారు. గత పాలకులు ప్రాజెక్టు పూర్తికాకుండానే డ్రామాలు ఆడారని విమర్శించిన ఆయన, ప్రస్తుతం సూపర్‌ ఎల్‌ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతమైన నీటి నిర్వహణ చేపడుతూ డెల్టాలో పంటలకు నిరంతరం నీరు అందిస్తోందని వివరించారు.