
జనగామ, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛన్ల కోసం అప్లయ్ చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం ఆయన సామాజిక భద్రత పింఛన్ల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పైలేరియా సహా రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోందన్నారు. కల్లుగీత, చేనేత కార్మికులకు సైతం సర్కారు అండగా నిలుస్తోందన్నారు.
ఆగస్ట్ నెల 31వ తేదీలోగా https://cheyutha.telangana.gov.in వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. అలాగే, భర్త వదిలేయడంతో నాలుగేండ్ల చిన్నారితో కలిసి జీవిస్తున్న దేవరుప్పుల మండలం, నీర్మాలకు చెందిన మహిళ సుల్తానా బేగంకు కలెక్టర్ కుట్టు మిషన్ అందించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం సతీశ్, అడ్మిన్ అసిస్టెంట్ రమేశ్ పాల్గొన్నారు.