Reading Time: < 1 minute
Fssai Ban Everest Lalji Godhoo Asafoetida Quality Violations

FSSAI: ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ సంస్థలకు చెందిన ఇంగువ (అసాఫోటిడా) అమ్మకాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాత్కాలికంగా నిషేధం విధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అలర్ట్ అయిన ఆహార భద్రతా అధికారులు.. ముంబైలోని ఈ రెండు కంపెనీల తయారీ కేంద్రాలతో పాటు గుజరాత్‌లోని ఉంబర్‌గావ్‌లో ఉన్న ఎవరెస్ట్ యూనిట్ నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ నాణ్యతా పరీక్షల్లో ఇరు కంపెనీల ఇంగువ ఉత్పత్తులు తీవ్ర ప్రమాణాల లోపంతో ఉన్నట్లు తేలింది.

FSSAI నిబంధనల ప్రకారం.. కాంపౌండెడ్ ఇంగువలో కనీసం 5 శాతం ఆల్కహాల్-సోల్యుబుల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉండాలి. కానీ, పరీక్షించిన శాంపిళ్లలో ఇది కేవలం 0 నుంచి 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. అంటే, ఈ కంపెనీలు చట్టబద్ధంగా వాడాల్సిన పరిమాణం కంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ముడి ఇంగువను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా లాల్‌జీ గోధూ యూనిట్‌లో సేకరించిన ఆరు రకాల ముడి ఇంగువలో స్టార్చ్ శాతం ఏకంగా 15 నుంచి 32 శాతం వరకు ఉన్నట్లు బయటపడింది. నిబంధనల ప్రకారం ఇది గరిష్టంగా 1 శాతం మాత్రమే ఉండాలి. దీంతో నాణ్యతా ప్రమాణాలు పాటించనందుకు ఈ ఉత్పత్తులపై FSSAI చర్యలకు దిగింది.

ఇదే సమయంలో ఎవరెస్ట్ సంస్థకు చెందిన ఎగ్ కర్రీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలాలలో కూడా నియమ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు FSSAI గుర్తించింది. అయితే, ప్రస్తుతానికి ఈ మూడు మసాలా ఉత్పత్తులపై ఎలాంటి నిషేధం విధించలేదు. నిబంధనలు ఉల్లంఘించడంపై వివరణ ఇవ్వాలని, తిరిగి నిర్దేశిత ప్రమాణాలు అందుకునేందుకు తీసుకునే చర్యలపై కార్యాచరణ నివేదిక సమర్పించాలని FSSAI రెండు కంపెనీలను ఆదేశించింది. అలాగే మార్కెట్లో ఉన్న సబ్‌స్టాండర్డ్ ఉత్పత్తులను కంపెనీలే స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని సూచించింది. నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు లేదా సాచురేటెడ్ ఫ్యాట్ పరిమితికి మించి ఉంటే, ప్యాకెట్ ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా ముదురు ఎరుపు రంగు Hexagonal హెచ్చరిక లేబుల్‌ను తప్పనిసరి చేయాలని FSSAI ప్రతిపాదించింది.