
High Court Slams FDA: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌డీఏ తీసుకున్న రెండు కీలక చర్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చట్టాన్ని సరిగ్గా విశ్లేషించకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు ‘ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా’ ఉందని పేర్కొంది.
తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ప్రాంగణంలోని రెస్టారెంట్లపై, అలాగే పుణెలోని సిప్లా ఫార్మా సంస్థపై తీసుకున్న చర్యల విషయంలో కోర్టు ముందు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సిప్లా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్‌కు చెందిన పుణెలోని యూనిట్ డ్రగ్ సేల్ లైసెన్స్‌ను ఎఫ్‌డీఏ రద్దు చేసింది. అయితే ఈ చర్యపై విచారణ చేపట్టిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్‌ల ధర్మాసనం ఎఫ్‌డీఏ తీరును తప్పుబట్టింది.
కంపెనీ ప్రతినిధిని విచారణకు పిలుస్తూ.. ఎఫ్‌డీఏ పంపిన ఈమెయిల్‌పై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజున విచారణకు హాజరు కావాలని పిలవడాన్ని ప్రశ్నించింది. ఎఫ్‌డీఏ మంచి పని చేస్తోందని ప్రశంసించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం అధికారులు హద్దులు దాటుతున్నారని వ్యాఖ్యానించింది. ఎఫ్‌డీఏ వ్యవహరించిన తీరు ‘హైహ్యాండెడ్’గా ఉందని, సరైన విధానాన్ని పాటించకుండా లైసెన్స్‌ను రద్దు చేసిందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో సిప్లా యూనిట్ డ్రగ్ సేల్ లైసెన్స్ రద్దు ఉత్తర్వును ఎఫ్‌డీఏ వెనక్కి తీసుకుంది.
మరోవైపు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న MCA ప్రాంగణంలోని ఐదు రెస్టారెంట్ల కార్యకలాపాలను ఎఫ్‌డీఏ నిలిపివేసింది. ఈ కేసులోనూ కోర్టు ఎఫ్‌డీఏ తీరును తీవ్రంగా ప్రశ్నించింది. తాజాగా నిర్వహించిన తనిఖీలో ఆ రెస్టారెంట్లు ఆహార భద్రతా నిబంధనల్లో 88% మేరకు నిబంధనలు పాటిస్తున్నట్లు తేలింది. అయినప్పటికీ లైసెన్స్‌లను సస్పెండ్ చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెస్టారెంట్ల లైసెన్స్‌లు ఎంసీఏ పేరుతో ఉండగా.. వాటిని ఎంసీఏతో ఒప్పందం చేసుకున్న ‘శిర్కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనే మరో సంస్థ నిర్వహిస్తోంది. ఇదే కారణంతో ఎఫ్‌డీఏ లైసెన్స్‌లను సస్పెండ్ చేసింది. అయితే ఒక సంస్థకు లైసెన్స్ ఉండి, మరో సంస్థ ఆ ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహించడాన్ని నిషేధించే నిబంధన చట్టంలో లేదని కోర్టు అభిప్రాయపడింది.
గత విచారణలోనే ఎఫ్‌డీఏ అధికారులు చట్టాన్ని పూర్తిగా పరిశీలించి, ఆచరణాత్మక దృక్పథంతో వ్యవహరించాలని కోర్టు సూచించింది. అయినప్పటికీ అధికారులు ఆదేశాలను పాటించకుండా ‘పెడాంటిక్’ అంటే అక్షరాలా నిబంధనలను మాత్రమే పట్టుకుని, ఆచరణాత్మక దృక్పథాన్ని పక్కన పెట్టారని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. అధికారులపై ధిక్కరణ చర్యలు తీసుకునే పరిస్థితి వస్తోందని కోర్టు హెచ్చరించింది. అవసరమైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ.. “మీరు లార్డ్ అనుకుంటున్నారా? ఏదైనా చేయొచ్చని భావిస్తున్నారా?” అంటూ ఎఫ్‌డీఏ తీరును ప్రశ్నించింది. ఎఫ్‌డీఏ ఎప్పుడూ ఎందుకు ఇంత తొందరపాటుతో ఉత్తర్వులు జారీ చేస్తోందని కోర్టు ప్రశ్నించింది. చట్టాన్ని సరిగ్గా విశ్లేషించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనవసర వివాదాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది.
కోర్టు హెచ్చరికల నేపథ్యంలో ఎంసీఏకు కొత్తగా నోటీసు జారీ చేసి, ఎంసీఏ-శిర్కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మధ్య ఒప్పందంపై వారి వాదనను వినాలని ఎఫ్‌డీఏ అంగీకరించింది. అనంతరం కారణాలతో కూడిన తాజా ఉత్తర్వును జారీ చేస్తామని తెలిపింది. ఈ హామీని కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం రెస్టారెంట్లు ఆహార భద్రతా నిబంధనలను పాటిస్తున్నందున వాటి లైసెన్స్ సస్పెన్షన్ ఉత్తర్వు రద్దయినట్లేనని స్పష్టం చేసింది. దీంతో ఆ రెస్టారెంట్లు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. సిప్లా కేసులో ప్యాకేజింగ్, రియాక్టిన్ ప్లస్ ట్యాబ్లెట్ల రీకాల్‌కు సంబంధించిన ఫాలోఅప్ తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించామని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఆ కారణంగా పుణెలోని వాడ్కి ప్రాంతంలోని సిప్లా క్యారీయింగ్ అండ్ ఫార్వార్డింగ్ సదుపాయానికి సంబంధించిన డ్రగ్ సేల్ లైసెన్స్‌లను ఆగస్టు 27 నుంచి రద్దు చేసింది. అయితే బాంబే హైకోర్టు తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో ఈ చర్యను ఎఫ్‌డీఏ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.