Reading Time: 2 minutes
Bhopal Woman Allegedly Kills Lovers Wife With Ex Boyfriend

Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. వినడానికే ఎంతో విచిత్రంగా ఉన్న ఈ కోణాలన్నీ కలిసిన ఒక దారుణమైన నిజ జీవిత కథ భోపాల్‌ పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ప్రియుడితో భార్య కలిసి ఉండటం సహించలేని ఒక మహిళ, తన మాజీ ప్రియుడిని రంగంలోకి దించి ఓ నిండు ప్రాణాన్ని దారుణంగా బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మోనూ రైక్వార్ అనే వ్యక్తి ఆగస్టు 23న తన భార్య రాఖీ రైక్వార్ కనిపించడం లేదంటూ రాతిబడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం మొదలైంది. నాలుగు రోజుల పాటు పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆగస్టు 27న స్థానిక గోరేగావ్ ప్రాంతంలోని ఒక నిర్మానుష్య పాడుబడిన భవనంలో రాఖీ శవమై తేలింది. ఈ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మోనూ రైక్వార్‌ అనే వ్యక్తికి శశి రైక్వార్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మోనూ రైక్వార్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే మోనూ తన భార్య రాఖీతో కలిసి సంతోషంగా ఉండటం శశికి అస్సలు నచ్చలేదు. రాఖీని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన శశి, తన పాత ప్రియుడైన నరేంద్రను ఈ కుట్రలోకి లాగింది. ఆగస్టు 23న మోనూ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో రాఖీ, శశి మాత్రమే ఉన్నారు. పథకం ప్రకారం శశి తన మాజీ ప్రియుడు నరేంద్రను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి రాఖీపై దాడి చేశారు. శశి ఆమె నోరు నొక్కేయగా, నరేంద్ర గొంతు నులిమాడు. అంతటితో ఆగకుండా దుపట్టాతో గొంతుకు గట్టిగా ముడివేసి రాఖీ ఊపిరి తీసేశారు. హత్య అనంతరం శవం దొరక్కుండా ఉండేందుకు రాఖీ మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, ఇంటికి సమీపంలోనే ఉన్న ఒక పాడుబడిన భవనంలో పడేసి దాచిపెట్టారు. ఆ తర్వాత నరేంద్ర అక్కడి నుంచి పరారై ఇటార్సీకి పారిపోయాడు. ఇటు ఏమీ తెలియనట్లు నటిస్తూ భర్త మోనూతో కలిసే శశి కూడా నాటకమాడింది. పోలీసులకు ఎక్కడా అనుమానం రాకుండా ఉండేందుకు శశి జాగ్రత్తపడినా, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సందేహాస్పద కదలికల ఆధారంగా పోలీసులు శశిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల గట్టి విచారణతో శశి నిజం ఒప్పుకోక తప్పలేదు. తన ప్రియుడి భార్యను వదిలించుకోవడానికే పాత మిత్రుడు నరేంద్రతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె అంగీకరించింది. శశి ఇచ్చిన సమాచారంతో ఇటార్సీలో దాక్కున్న నరేంద్రను కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ భోపాల్ జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ అంకితా ఖాతర్కర్ వెల్లడించారు. భర్తపై ఉన్న మోజు, క్రూరమైన అసూయ చివరకు ఒక నిండు ప్రాణాన్ని తీసి, ఇద్దరినీ జైలు గోడల వెనక్కి నెట్టింది.