
నిర్మల్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఒక కుటుంబం నిద్రలోనించి మేల్కొని తలుపు తెరిచి చూస్తే పొద్దు పొద్దున ఇంటి ముందు మనిషి వెన్నెముక కనిపించడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. క్షుద్రపూజలతో ఒక్కసారిగా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామం భయాందోళనలో మునిగిపోయింది.
దేవునిగూడెం గ్రామంలో ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి ముందు గురువారం (ఆగస్టు 27) రాత్రి కొబ్బరికాయలు, మానవుని వెన్నెముక, నిమ్మకాయలు జిల్లేడు, మర్రి, రాయి, బొమ్మిడి ఆకులను ఓ కర్రకు కట్టి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఆ ఇంటి యజమాని తెల్లవారు లేచి చూసేసరికి క్షుద్రపూజల ఆనవాలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన స్థానికంగా గ్రామంలో కలకలం సృష్టించింది. క్షుద్ర పూజల పై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. విచారణ జరిపి క్షుద్రపూజలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్న రోజుల్లో క్షుద్రపూజలు అంటూ జనాలను భయపెట్టడం పద్ధతి కాదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు సహకరిస్తామని చెప్పారు.