Reading Time: < 1 minute

Pm Modi foreign tour: యురేనియం, 5బిలియన్ డాలర్ల వాణిజ్యంపై.. భారత్,ఉజ్బెకిస్తాన్ కీలక ఒప్పందాలు

Caption of Image.

ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా భారత్‌, ఉజ్బెకిస్తాన్‌ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల మధ్య యురేనియం సరఫరాకు ఓ విధానాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అణుశక్తి అవసరాల కోసం ఉజ్బెకిస్తాన్‌ నుంచి యురేనియం దిగుమతి చేసుకోవాలని భారత్‌ భావిస్తున్న క్రమంలో ఈ ఒప్పందం కీలకంగా మారింది.

ప్రస్తుతం భారత్‌, ఉజ్బెకిస్తాన్‌ మధ్య 1 బిలియన్‌ డాలర్లకు పైగా వాణిజ్యం జరుగుతుండగా 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని ఏటా 5 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇరు దేశాల కంపెనీలతో కలిసి వ్యాపార సదస్సు నిర్వహించేందుకు అంగీకరిస్తూ తాష్కెంట్‌లో ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్‌తో ప్రధాని మోదీ ప్రతినిధి బృంద స్థాయి చర్చల్లో ఈ ఒప్పందాలు చేసుకున్నారు. 

ఇంధనం, కీలక ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, రక్షణ, సాంకేతికత, ఔషధాలు, వ్యవసాయం, ఆభరణాలు వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్, అంతరిక్షం, అణుశక్తి, స్టార్టప్‌లు, డిజిటల్‌ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు.

భారత్‌లోని గిఫ్ట్‌ సిటీ, ఉజ్బెకిస్తాన్‌లోని న్యూ తాష్కెంట్‌ ద్వారా పట్టణాభివృద్ధి, నైపుణ్యాలు, సాంకేతికతను పరస్పరం పంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. వివిధ రంగాలకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌లు రూపొందించి, నిరంతర సమన్వయంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు.

©️ VIL Media Pvt Ltd.