
ఉదయం లేవగానే చాలామంది మొదటగా ఫోన్ చేతిలోకి తీసుకుంటారు. కానీ “మానిఫెస్టేషన్”పై నమ్మకం పెట్టుకునే కొందరు మాత్రం ఆ మొదటి ఐదు నిమిషాలను తమ లక్ష్యాలకు కేటాయిస్తారు. మనోవిజ్ఞానం దృష్టిలో ఇవి కేవలం కొత్త ఆలోచనలు కాదు, రోజంతా మన దృష్టి ఎటు వెళ్లాలో నిర్ణయించే చిన్న సాధనం.
ఉదయం లేవగానే ఐదు నిమిషాలు తమకు ఏం కావాలో స్పష్టంగా మనసులో పెట్టుకుంటారు. అది ఇప్పటికే జరిగిపోయినట్టుగా ఊహిస్తారు. ఆ అనుభూతిని కాసేపు మనసులో నిలుపుకుంటారు. కొందరు అదే లక్ష్యాన్ని రాసుకుంటారు. మరికొందరు ఆ రోజులో లక్ష్యానికి దగ్గర చేసే ఒక్క చిన్న పని ఏదో నిర్ణయిస్తారు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మన మెదడులో ఉన్న రెటిక్యులార్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ఎఎస్), అంటే బయట నుంచి వచ్చే సమాచారం అంతా ఒకేలా తీసుకోదు. అవసరమైనది ఏది? అవసరం లేనిది ఏది? అని ఫిల్టర్ చేస్తుంది.
మనం ఏ లక్ష్యంపై దృష్టి పెడితే, ఆ లక్ష్యానికి సంబంధించిన సూచనలు, అవకాశాలు, పరిచయాలు ఎక్కువగా దృష్టిలో పడతాయి. మన చుట్టూ ఏమీ మారకపోయినా, మనసు వాటిని గమనించే తీరు మారిపోతుంది. దీనిని ఫ్రీకెన్వ్సీ ఇల్యూషన్ లేదా బాడర్– మైన్‌హోఫ్ ఫినామినాతో కూడా పోలుస్తున్నారు. అంటే ఒక విషయాన్ని కొత్తగా తెలుసుకున్న తర్వాత, అదే విషయం చుట్టూ తరచుగా కనిపిస్తున్నట్లు అనిపించే మానసిక ప్రభావం.
ఉదాహరణలతో తెలుసుకుందాం
ఒక వ్యక్తి కొత్తగా ఎరుపు రంగు కారు కొనాలని అనుకుంటున్నాడని అనుకుందాం. ఆ కారు గురించి ఇంటర్నెట్‌లో చూస్తాడు, వీడియోలు చూస్తాడు, వివరాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత రోడ్డుపైకి వెళ్లినప్పుడు, అదే మోడల్‌కు చెందిన ఎరుపు కార్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఆ కార్లు అప్పుడే కొత్తగా రాలేదు. ఇంతకుముందు కూడా అవి రోడ్లపై తిరుగుతున్నాయి. కానీ అతని మెదడు ఇప్పుడు ఆ కారు మీదే దృష్టి పెట్టడంతో వాటిని ఎక్కువగా గుర్తించడం ప్రారంభించింది. దీనినే ‘‘పునరావృత దర్శన భ్రమ’’ అని చెప్పొచ్చు.
మరో ఉదాహరణ.. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని అనుకుందాం. ప్రతిరోజూ ఆ పరీక్ష గురించే ఆలోచిస్తున్నారు. అకస్మాత్తుగా ఎక్కడ చూసినా ఉద్యోగ ప్రకటనలు, కోచింగ్ సెంటర్ల ప్రకటనలు, పరీక్షలకు సంబంధించిన వార్తలు, వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అవి కొత్తగా రావడం కాదు. మీ లక్ష్యంపై మీ దృష్టి కేంద్రీకృతం కావడంతో, వాటిని మీ మెదడు ముందుకంటే ఎక్కువగా గుర్తిస్తోంది. ఇదే పునరావృత దర్శన భ్రమ (ఫ్రీక్వెన్సీ ఇల్యూషన్).
చివరికి పని చేయాల్సింది మనమే
ఇది కేవలం ఊహించడమే కాదు. ఆలోచనకు తోడు చర్య కూడా ఉండాలి. ఉదయం ఐదు నిమిషాలు లక్ష్యాన్ని గుర్తుచేసుకుని, ఆ తర్వాత దానికి తగ్గ చిన్న పనులు చేయడం వల్లే ఈ అలవాటు నిజమైన ఫలితం ఇస్తుంది. కాబట్టి మానిఫెస్టేషన్‌ను ఒక అద్భుత శక్తిగా కాకుండా, మనసును సరిచేసి, అవకాశాలను పట్టుకునే శిక్షణగా చూడాలి. అప్పుడు మాత్రమే రోజూ కనిపించే చిన్న సంకేతాలు పెద్ద మార్పుల దిశగా దారితీయగలవు. ఇలాంటి ఆలోచనలు ఉదయం పూట చేయడం వల్ల మనసు ఆహ్లాదకరంగా నిర్ణయాత్మకంగా ఉంటుంది.
మాయ కాదు, దృష్టి మార్పు
మానిఫెస్టేషన్‌ను “అవసరమైనది ఆకర్షించడం” కంటే, “అవసరమైనదాన్ని గుర్తించే ఫోకస్ పెరగడం” గా చూడటం సరైంది. ఇది ఆలోచనలపై మాత్రమే కాదు, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నిర్ణయాలు మరింత నమ్మకంగా తీసుకోవడం, సందేహాలు తగ్గించడం, అవకాశానికి వెంటనే స్పందించడం ఈజీ అవుతుందని మనోవిజ్ఞాన కోణం చెప్తోంది. సానుకూల భావనలు సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో, నిల్వ చేయడంలో మెదడుకు సాయపడతాయి.