
లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, ఖాసిం పాకిస్తాన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ తండ్రిని పాకిస్తాన్ ప్రభుత్వం జైల్లోనే చంపేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, పాక్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇమ్రాన్ కుమారులు సులేమాన్ ఖాన్, కాసిం ఖాన్ స్కై స్పోర్ట్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి, భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు పాక్ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం మా తండ్రిని జైల్లోనే చంపాలని చూస్తోందని ఆరోపించారు. జైల్లో ఆయనను రోజుకు 23 గంటలకు పైగా చీకటి గదిలో ఒంటరిగా ఉంచుతున్నారని, విద్యుత్ సౌకర్యం కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు.
జైలులో సరైన వైద్య సదుపాయాలు అందించకపోవడం వల్ల మా తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక కంటి చూపును కోల్పోతున్నారని తెలిపారు. గత ఏడు నెలలుగా కనీసం తమ తండ్రితో ఫోన్ మాట్లాడటానికి లేదా కలవడానికి పాక్ అధికారులు అనుమతించడం లేదని వాపోయారు. లండన్‌లో నివసిస్తున్న తాము పాకిస్థాన్‌కు వెళ్లి తండ్రిని కలవాలని ప్రయత్నించగా.. సాంకేతిక కారణాలు చెప్తూ పాక్ ప్రభుత్వం తమ వీసాలను బ్లాక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాచ్ సమయంలో స్కై స్పోర్ట్స్ ఈ పొలిటికల్ ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూ టెలికాస్ట్ ఆపకపోతే లంచ్ తర్వాత తమ ఆటగాళ్లను మైదానంలోకి పంపకుండా మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. చర్చల అనంతరం పాక్ ప్లేయర్లు గ్రౌండ్లోకి రావడంతో యధావిధిగా మ్యాచ్ జరిగింది.
కాగా, 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి ఆరోపణల కేసుల్లో 2023 ఆగస్టులో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఒక కేసులో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఇమ్రాన్, ఇవన్నీ రాజకీయం ప్రేరేపితమైన కేసులని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదుగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మూడేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు.