
- రాష్ట్రంలో లంచావతారుల కొత్త రూటు
- వారసత్వ సంపదంటూ బుకాయిస్తున్రు
- ఏసీబీ సోదాల్లో కిలోల కొద్దీ గోల్డ్ బయటికి
- బ్యాంకు లాకర్లలో ప్లాటినం, వజ్రాలు సైతం
- మూడేండ్లలో 90 కిలోల గోల్డ్, క్వింటన్నర సిల్వర్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: అవినీతి అధికారులు రూటు మార్చారు. తమ అక్రమ సంపాదనను ఒకప్పుడు బ్యాంకు లాకర్లలో, షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో, ఇండ్లు, ప్లాట్లు, రియల్ఎస్టేట్ పెట్టుబడుల రూపంలో దాచుకునేవారు. కానీ తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ చేపడ్తున్న వరుస సోదాలతో మరో కొత్త విషయం వెలుగుచూసింది. నగదు, ఆస్తి పత్రాలతోపాటు కిలోల కొద్దీ బంగారం బయటపడుతుండడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. అవినీతి సొమ్ము నగదు, భూముల రూపంలో కన్నా బంగారంగా మార్చి దాచుకోవడమే సురక్షితమని అధికారులు భావిస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఏసీబీ సోదాల్లో పట్టుబడిన బంగారాన్ని తమకు వారసత్వంగా వస్తున్నదనో, పెళ్లి సమయంలో కట్న కానుకల రూపంలో ఇచ్చిందనో లెక్కలు చూపి తప్పించుకుంటున్నారు.
2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయింది. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులతోపాటు మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, రోడ్లు, ఇతరత్రా మౌలికవసతుల ప్రాజెక్టులు చేపట్టడం.. నగరాలు, పట్టణాలు విస్తరణతో రియల్ఎస్టేట్జోరందుకోవడం ఇందుకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్తదితర శాఖల్లో పలువురు కీలకమైన అధికారుల ఆస్తులు వందల కోట్లకు పెరిగిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం ఆదేశాల మేరకు ఇలాంటి అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఏసీబీ కేసుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2020లో ఏసీబీ దాడులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 84 నమోదైతే 2024లో ఈ సంఖ్య 152కు, 2025లో 199కి పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు 55 కేసులు నమోదయ్యాయి.
ఏసీబీ దాడుల్లో కిలోలకొద్దీ పసిడి..
ఇటీవలి ఏసీబీ దాడుల్లో అవినీతి అధికారుల వద్ద కిలోల కొద్దీ పసిడి బయటపడుతున్నది. ఒక మధ్యతరగతి కుటుంబం 10 గ్రాముల బంగారం కొనాలంటే ఎన్నో లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంక్ లాకర్లలో ఏసీబీ తనిఖీలు చేసినప్పుడు పెద్దమొత్తంలో బంగారం దొరుకుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కొందరి వద్ద ఆభరణాల రూపంలో దొరుకుతుండగా, మరికొందరి వద్ద ఏకంగా బంగారు, వెండి బిస్కెట్ల రూపంలో లభిస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ చేపట్టిన తనిఖీలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వెలుగులోకి వస్తున్న గణాంకాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఇప్పటివరకు వివిధ సోదాల్లో ప్రభుత్వ అధికారుల నుంచి సుమారు 90 కిలోల పసిడి, 150 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ రికార్డులు చెప్తున్నాయి. ఆర్ అండ్ బీ ఇంజనీర్ -ఇన్ -చీఫ్ బి మోహన్ నాయక్‌కు బిస్కెట్ల రూపంలో బంగారం దాచుకునే అలవాటు ఉన్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఈయన దగ్గర 2.5 కిలోల బంగారం బిస్కెట్ల రూపంలో దొరకడం గమనార్హం. ఇక ఇటీవల పట్టుబడ్డ శామీర్‌పేట తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరిత వద్ద ఏకంగా రూ. 1.20 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు దొరికాయి.
బంగారం రూపంలో ఎందుకంటే?
అవినీతి అధికారులు తమ అక్రమ సంపాదనను దాచుకోవడానికి నగదు, భూముల కంటే బంగారం వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ, ఐటీ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల కండ్లు కప్పడానికి అక్రమార్కులు బంగారాన్ని ఒక సురక్షిత సాధనంగా వాడుకుంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు దాస్తే పాన్, ఆధార్ లింకుల వల్ల ఐటీ శాఖ నిఘా ఉంటుంది. కానీ స్థానిక వ్యాపారుల వద్ద నగదు రూపంలో కొనే బంగారానికి ఎలాంటి డిజిటల్ గుర్తింపు ఉండదు. బంగారం ఎప్పటికీ చెల్లుబాటు అయ్యే ఆస్తి కావడం, కొన్ని కోట్ల విలువైన బంగారాన్ని ఒక చిన్న లాకర్ లేదా హ్యాండ్‌బ్యాగుల్లో దాచుకునే అవకాశం ఉండడం మరో కారణం. భూములు, ఇండ్లు, రియల్ఎస్టేట్లో పెట్టుబడులకు రిజిస్ట్రేషన్లు, లీగల్ పత్రాలు, బినామీల అవసరం ఉంటుంది. బంగారానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ నిబంధనలు ఉండవు. దేశంలో ఎక్కడైనా క్షణాల్లో దీనిని నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదీగాక దర్యాప్తు సంస్థలకు పట్టుబడితే తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తిగా, తమ పెళ్లిళ్లలో వచ్చిన ‘స్త్రీ ధనం’ కింద వచ్చినట్టు చూపి చట్టపరమైన లొసుగుల ద్వారా తప్పించుకునే అవకాశం ఉండడమే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.
కిలోకి పైగా బంగారంతో పట్టుబడ్డ అధికారులు
కె. జగజ్యోతి (ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ) 3 కిలోలకు పైగా బంగారం
సంగెం అనంత లక్ష్మీకుమార్ (వాటర్ బోర్డు జీఎం) 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి
సంకిరెడ్డి భీమ్‌రెడ్డి (డీఎస్పీ) 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి
బి మోహన్ నాయక్ (ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ) 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి
దావులూరి ఆనంద్ (హనుమకొండ ఎస్‌ఆర్‌వో-2) కిలో బంగారం, 2.6 కిలోల వెండి
పుప్పాల శ్రీనివాస్ (డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్) 1.5 కిలోల బంగారం
ఏ.జగదీశ్వర్ రెడ్డి (చీఫ్ ఇంజనీర్, ట్రైబల్ వెల్ఫేర్) 1.5 కిలోల బంగారం
జ్యోతి (మున్సిపల్ కమిషనర్, బండ్లగూడ జాగీర్) కేజీకి పైగా బంగారు ఆభరణాలు
హరి భూషణ్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్&బీ) 2 కిలోల బంగారం
వి. దేవేందర్ రెడ్డి (చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్) కేజీన్నర బంగారం
పి. రాధాకృష్ణ (సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్-జిల్లా) 1.8 కిలోల బంగారం
మూడ్ కిషన్(డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్) కేజీ బంగారం
ముత్యం వెంకటరమణ (రెడ్కో డీఈ ) 2.094 కిలోల బంగారం
బచ్చు రవీందర్( హెచ్‌ఎండీ చీఫ్ ఇంజనీర్) 1.5 కిలోల బంగారం, 12.5 కిలోల వెండి
ఎస్. నరహరి రావు (ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్) కిలో బంగారం, రెండు కిలోల వెండి
నాయిని భుజంగరావు (మాజీ అడిషనల్ ఎస్పీ) కిలో బంగారం, 1.5 కిలోల వెండి
మధుసూదన్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్) 1.2 కిలోల బంగారం
తుమ్మకొమ్మ సుచరిత (శామీర్‌పేట తహసీల్దార్) 1.20 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు
కుమార్(హైదరాబాద్ వాటర్‌బోర్డు జీఎం) 2.1 కేజీల బంగారం, 9.5 కిలో వెండి