
పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా కల్లుగప్పి హైదరాబాద్ సిటీకి గంజాయి చేరుతోంది. చట్టవిరుద్ధమని తెలిసినా యువత మత్తుకు బానిసలు కావడం, కొందరు గంజాయి ఆదాయంపైనే ఆధారపడటంతో గంజాయి రవాణా ఆగటం లేదు. 2026 ఆగస్టు 30వ తేదీన విశాఖ పట్నం జిల్లా నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో 11.365 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కుత్బుల్లాపూర్ HMT జంగిల్ పాత గవర్నమెంట్ కాలేజీ దగ్గర తనిఖీలు చేసి పట్టుకున్న పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మారేడుబుడి రాజు (33), సిరాపు హేమ (41) ఉన్నారు.
A1 నిందితుడు రాజు విశాఖ జిల్లా మాడుగుల నుంచి హైదరాబాద్కు గంజాయి తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు, సంచులు స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు.
గంజాయి సరఫరా చేసిన ప్రధాన నిందితుడు బొంపార రమణ (A3) పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జీడిమెట్ల పోలీసులు.