Reading Time: < 1 minute
ములుగు జిల్లాలో విషాదం.. రాఖీ పండుగకు వచ్చి అన్నదమ్ముల మృతి

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో జారిపడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులకు వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14) ఇద్దరు కుమారులు ఉన్నారు. వినయ్ కిశోర్ ఇంటర్, రాజేశ్ పదో తరగతి చదువుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వాతి తన ఇద్దరు కుమారులను తీసుకుని ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్‌లాల్‌పల్లిలో ఉన్న పుట్టింటికి వెళ్లారు.

ఆదివారం సెలవు కావడంతో ఇద్దరు బాలురను అక్కడే ఉంచి స్వాతి తిరిగి కమలాపూర్‌కు వెళ్లారు. సాయంత్రం సమయంలో అన్నదమ్ములు తమ బంధువుల అబ్బాయితో కలిసి గ్రామ సమీపంలోని మొండికుంట వైపు వెళ్లారు. అక్కడ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కుంటలో మొరం మట్టి కోసం తీసిన గుంతలోకి వినయ్ కిశోర్, రాజేశ్ ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనను గమనించిన మరో బాలుడు వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. అయితే అప్పటికే ఇద్దరు బాలురు మృతిచెందినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యాకూబ్, స్వాతి దంపతులు తమ ఇద్దరు కుమారులను ఒకేసారి కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం స్థానికులకు కూడా కష్టంగా మారింది.