
లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెండైన ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు 2026 ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే MLC ని MIM పార్టీ బండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో MIM అధినేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ వ్యవహారాన్ని క్యాష్ చేసుకోవాలని కొందరు ఆకతాయిలు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు విడుదల చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోలు, ఫొటోలు విడుదల చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తున్నారు.
బెదిరింపులతో తన రాజకీయ జీవితానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఎమ్మెల్సీ పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ ప్రతిష్ఠ, పార్టీకి చెడ్డపేరు వచ్చేలా కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేశారు. బెదిరింపుల వెనుక రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చని ఎమ్మెల్సీ అనుమానం వ్యక్తం చేశారు.
డీప్‌ఫేక్ వీడియోలు విడుదలైతే హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తక్షణ, నిష్పక్షపాత దర్యాప్తు కోరారు. డీప్‌ఫేక్/మార్ఫింగ్ కంటెంట్ విడుదల కాకుండా అడ్డుకోవడంతో పాటు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.