
న్యూఢిల్లీ: భారత పొరుగు దేశం నేపాల్‌లో ప్రళయం సృష్టించిన ఆకస్మిక వరద వల్ల 320 మంది భారతీయులు, 100 మంది భారత సంతతికి చెందిన వారు ఇప్పటికీ అందుబాటులో లేరని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. శుక్రవారం (ఆగస్ట్ 28) కేంద్ర విదేశాంగా శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
320 మంది భారత జాతీయులు ఇంకా అందుబాటులో లేరని.. అలాగే భారత సంతతికి చెందిన సుమారు 100 మందిని ఇంకా సంప్రదించాల్సి ఉందన్నారు. గల్లంతైన వారి వివరాలను అధికారులు సేకరిస్తుండటంతో ఈ సంఖ్యలు మారే అవకాశం ఉందని చెప్పారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ప్రభావితమైన భారతీయులను సంప్రదించడానికి, వారి తరలింపును సమన్వయం చేయడానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కాఠ్మండుకు వచ్చిన 21 మంది భారత జాతీయులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు. నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ కాఠ్మండులో ఆ బృందాన్ని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. విషాద సమయంలో నేపాల్‌కు భారత్ ఆపన్నహస్తం అందించిందన్నారు. ఆ దేశానికి మరింత సహయం చేస్తామని చెప్పారు. సహాయ సామగ్రితో రెండు విమానాలు ఇప్పటికే నేపాల్ బయలుదేరాయని.. మూడో విడత సహాయ సామగ్రి శుక్రవారం సాయంత్రం బయలుదేరుతుందని తెలిపారు.
నేపాల్ అభ్యర్థన మేరకు ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపడానికి భారత్ సిద్ధమవుతోందని.. ఇందుకోసం అవసరమైన పరికరాలను అంచనా వేయడానికి ముందుగా ఒక రెక్కీ బృందాన్ని విమానంలో పంపిస్తున్నామన్నారు. అలాగే ఒక వైద్య బృందాన్ని కూడా పంపుతున్నామని దీంతో పాటు నేపాల్‌లోని ప్రభావిత ప్రాంతాలలో కనెక్టివిటీని త్వరగా పునరుద్ధరించడానికి వీలుగా సాంకేతిక బృందాలను పంపుతున్నామని చెప్పారు.
వరదల నుంచి ఇప్పటివరకు రక్షించబడిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ఈ విషాదంతో ప్రభావితమైన ప్రజలకు సహాయాన్ని అందించడానికి అవసరమైన పరికరాలతో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపడానికి నేపాల్ అధికారులకు ప్రత్యేకంగా ప్రతిపాదన చేశాము. ఈ విషయంలో నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నాము. నేపాల్ అధికారులకు అవసరమైన ఏ ఇతర సహాయాన్ని అయినా అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.