Reading Time: < 1 minute

మొబైల్ రికవరీలో టాప్..వరుసగా మూడోసారి టాప్లో నిలిచిన సిరిసిల్ల జిల్లా

Caption of Image.
  •     78 శాతం ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  •     సీఈఐఆర్ టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైళ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకుంటున్నారు. సెంట్రల్ ఎక్విప్​మెంట్ ఐడెంటిటీ రిజస్టర్ వ్యవస్థను ఉపయోగించి ఈ ఏడాది 78 శాతం మొబైల్స్ ను రికవరీ చేసి, వాటిని బాధితులకు అందజేశారు. సెల్​ఫోన్​ రికవరీలో సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే టాప్​లో నిలిచింది.

వరుసగా మూడోసారి..

రాజన్న సిరిసిల్ల పోలీసులు దొంగలించిన ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేస్తున్నారు. జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతో సిరిసిల్ల పోలీసులు విజయవంతమవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ట్రాకింగ్ విధానాలు, సీఈఐఆర్ అప్లికేషన్‌‌‌‌ను సమర్థవంతంగా ఉపయోగించి 2023 నుంచి మొత్తం 2,286 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. 78 శాతం రికవరీ రేటు సాధించారు. 2023లో 1216 మొబైల్స్ చోరీ కాగా, 843ను ట్రేస్ చేశారు. 2024లో 1568 మోబైల్స్ పోతే 866 రికవరీ చేశారు. 2025లో 1734 మొబైల్స్ పోగా 672 రికవరీ చేసి బాదితులకు అందజేశారు. అత్యధికంగా మొబైల్స్​ రికవరీలో మూడేండ్ల నుంచి సిరిసిల్ల మొదటిస్థానంలో కొనసాగుతోంది. దక్షణాది రాష్ట్రాల్లోనే సిరిసిల్ల జిల్లా టాప్​లో నిలవడం విశేషం.

సీఈఐఆర్ టెక్నాలజీతో పట్టుకుంటున్నాం

మొబైళ్ల రికవరీలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం సాధించడం, జాతీయస్థాయిలో గుర్తింపు రావడం జిల్లా పోలీసుల పనితీరు, నిబద్ధతకు నిదర్శనం. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తున్న ఐటీ కోర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తూ చోరీకి గురైన మొబైల్స్ ను గుర్తిస్తున్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐర్  పోర్టల్ లో నమోదు చేయాలి. – మహేశ్ కుమార్ గీతే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల

©️ VIL Media Pvt Ltd.