
హైదరాబాద్ సిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్చేశారు. భూయజమానుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్లాట్లు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న కన్నెగంటి శ్రీనివాస్ రావు ను సూరారం పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్ కు తరలించారు.
బౌరంపేట్ లోని సతీష్ సొసైటీలో 600 గజాల ప్లాట్లకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజస్ట్రేషన్ చేసిన కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పేరుతో నకిలీ స్టాంపులు, సంతకాలు తయారీ చేయించాడు నిందితుడు. అసలు భూయజమానులు బాలకృష్ణమూర్తి, మహాలక్ష్మీల సంతకాలు ఫోర్జరీ చేసి వసుంధర అనే మహిళ పేరుతో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు శ్రీనివాసరావు మోసాల చిట్టా బయటికి వచ్చింది.
గతంలో శ్రీనివాసరావుపై దుండిగల్, నార్సింగి, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో సంతకాల ఫోర్జరీ,ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారంలో పలు కేసులు నమోదు అయ్యాయి. వరసగా నేరాలకు పాల్పడుతుండటంతో BNS సెక్షన్ 111(ఆర్గనైజ్జడ్ క్రైమ్) కింద కేసు నమోదు చేశారు సూరారం పోలీసులు. ఆస్తుల కొనుగోలు, అమ్మకాల సమయంలో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాకే లావాదేవీలు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.