Reading Time: 3 minutes
మరో జల ప్రళయం.. నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..

వరద నీరు తగ్గిందంటే ప్రమాదం ముగిసినట్టు కాదు. హిమాలయాల్లో అసలు ముప్పు ఆ తర్వాత కూడా మొదలవుతుంది. నేపాల్‌ను వణికించిన భారీ వరదలు, ఫ్లాష్‌ఫ్లడ్స్‌ ఇప్పటికే తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నదులు ఉప్పొంగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. కొండ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో హెచ్చరిక ఆందోళన పెంచుతోంది. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. టిబెట్‌ వైపు ఆనకట్ట లేదా సహజ నీటి అడ్డంకి తెగిందనే సమాచారంతో కొన్ని ప్రాంతాల్లో రెస్క్యూ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు రావడం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చెబుతోంది.

వరద వెళ్లిపోయిందా.. లేక మరో జల ప్రళయం పొంచి ఉందా?

హిమాలయ ప్రాంతాల్లో వరద అంటే కేవలం వర్షం వల్ల వచ్చే నీరు కాదు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడొచ్చు. మట్టి, రాళ్లు, మంచు నదీ మార్గాన్ని అడ్డుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా నీరు నిలిచిపోయి సహజమైన బ్యారియర్‌ లేక్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇలాంటి అడ్డంకి శాశ్వతమైన డ్యామ్‌ కాదు. నీటి మట్టం పెరిగితే అడ్డంకి బలహీనపడితే లేదా మరో కొండచరియ విరిగిపడితే పరిస్థితి ఒక్కసారిగా మారొచ్చు. అప్పుడు నిలిచిన నీరు భారీ ప్రవాహంగా దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. హిమాలయాల్లో ప్రమాదం ఒక చోట మొదలై మరో చోట విరుచుకుపడొచ్చు. అందుకే మొదటి వరద తగ్గుతున్నా ఎగువ ప్రాంతాల్లో నీటి నిల్వలు, నదీ ప్రవాహాలు, వర్ష పరిస్థితులు, కొండచరియల కదలికలను నిరంతరం పర్యవేక్షించాల్సిందే.

భారీ వర్షం పడితే?

ఇప్పటికే నేల తడిసి.. కొండ ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరో భారీ వర్షం పడితే కొత్త సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కొత్త కొండచరియలు విరిగిపడొచ్చు. నదీ ప్రవాహానికి మళ్లీ అడ్డంకులు ఏర్పడొచ్చు. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు మరింత ప్రమాదకరంగా మారొచ్చు. ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలు ఒక్కసారిగా దిగువకు రావొచ్చు. అంటే మొదటి ఫ్లాష్‌ఫ్లడ్‌ ముగిసినా దాని తర్వాత వచ్చే ద్వితీయ ప్రమాదాలను అంచనా వేయడమే ఇప్పుడు కీలకం.

ఇదే కారణంగా అధికారులు ఎగువ ప్రాంతాల పరిస్థితిని నిశితంగా గమనించాల్సి ఉంటుంది. ప్రజలను ముందుగానే తరలించడం, ప్రమాద ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఆపడం, రెస్క్యూ టీమ్‌లను కూడా అప్రమత్తంగా ఉంచడం అత్యవసరం.

రెస్క్యూ ఆపరేషన్‌కే బ్రేక్‌ ఎందుకు?

వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ బృందాలకే ప్రమాదం ఎదురైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ప్రమాదం తీవ్రంగా ఉన్న సమయంలో రెస్క్యూ టీమ్‌లను వెనక్కి పిలవడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది కూడా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన నిర్ణయమే. ప్రాణాలను కాపాడే బృందం కూడా ప్రమాదంలో చిక్కుకోకూడదు. అప్పుడే రెస్క్యూ వ్యవస్థ పనిచేస్తుంది.

నెట్‌వర్క్‌ పోతే.. యాత్రికుడి లొకేషన్‌ ఎలా?

హిమాలయ ప్రాంతాల్లో మరో పెద్ద సవాలు కమ్యూనికేషన్‌. కొండ ప్రాంతాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ ఎప్పుడైనా పోవచ్చు. విద్యుత్‌ సరఫరా దెబ్బతినొచ్చు. రోడ్లు తెగిపోవచ్చు. అప్పుడు సాధారణ ఫోన్‌ కాల్స్‌, మెసేజింగ్‌ యాప్స్‌ పనిచేయకపోవచ్చు. అందుకే రిమోట్‌ యాత్రా మార్గాల్లో GPS ట్రాకర్లు, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, ఎమర్జెన్సీ బీకన్లు వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది. యాత్రికుడి దగ్గర ఫోన్‌ ఉందా లేదా అనేది కాదు. యాత్రికుడి చివరి లొకేషన్‌ ఎవరి దగ్గర ఉందనేది ముఖ్యం.

కైలాస్‌ యాత్రలో రిస్క్‌ ఎవరిది?

నేపాల్‌ వరదలతో కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికుల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిమాలయాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతాయి. ఒక రూట్‌ ఉదయం సురక్షితంగా కనిపించినా.. కొన్ని గంటల్లోనే వర్షం, కొండచరియలు, నదీ ప్రవాహాలతో ప్రమాదకరంగా మారొచ్చు. అలాంటి సమయంలో టూర్‌ ఆపరేటర్ల దగ్గర స్పష్టమైన రూట్‌ మార్చే ప్రోటోకాల్‌ ఉండాలి. వాతావరణ హెచ్చరిక వచ్చినప్పుడు యాత్రికులను ఎక్కడ నిలిపివేయాలనేది తెలియాలి. రూట్‌ మూసివేస్తే ప్రత్యామ్నాయ మార్గం ఏంటనేది ఆలోచించాలి. ఎమర్జెన్సీలో కుటుంబాలకు సమాచారం ఎవరు ఇస్తారనేది ముందుగానే నిర్ణయించాలి. ప్రతి యాత్రికుడి లొకేషన్‌ అధికారులకు అందుబాటులో ఉందా అనేది అనుమానామే. యాత్రకు పంపించడం ఒక బాధ్యత. ప్రమాదంలో యాత్రికుడిని వెనక్కి తీసుకురావడం అంతకంటే పెద్ద బాధ్యత.

నేపాల్‌ తర్వాత.. మన యాత్రా మార్గాలు ఎంత సేఫ్‌?

ఇది నేపాల్‌తోనే ముగిసే ప్రశ్న కాదు. చార్‌ధామ్‌, అమర్‌నాథ్‌, హిమాచల్‌ పర్వత ప్రాంతాలు, లడఖ్ ఇతర హిమాలయ యాత్రా మార్గాల్లోనూ ఆకస్మిక వర్షాలు, ఫ్లాష్‌ఫ్లడ్స్‌, కొండచరియలు, రోడ్డు కనెక్టివిటీ దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఉంటాయి.

అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

వాతావరణ హెచ్చరిక వచ్చిన వెంటనే యాత్రికులను నిలిపివేస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ప్రమాద ప్రాంతాల్లో ఎంట్రీని తక్షణమే ఆపే వ్యవస్థ ఉండాలి. ఎమర్జెన్సీ షెల్టర్లు ఎక్కడున్నాయని ముందే గ్రహించాలి. రెస్క్యూ బృందాలు ఎంత వేగంగా చేరగలవో అంచనా వేయాలి. యాత్రికుల డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ఉందా లేదా…వారి చివరి లొకేషన్‌ను అధికారులు గుర్తించగలరా అని నిర్ణయం తీసుకోవాలి. నేపాల్‌ ఘటన తర్వాత ప్రతి హిమాలయ యాత్రా మార్గానికీ ఒక సేఫ్టీ ఆడిట్‌ అవసరమనే చర్చ మొదలవ్వాల్సిందే.

అసలు ముప్పు ఎక్కడ?

మొత్తం ఘటనను కలిపి చూస్తే.. నేపాల్‌ వరదలు మనకు ఒక కీలకమైన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ప్రకృతి విపత్తు మొదటి దశతో ముగియదు. మొదటి వరద తర్వాత బ్యారియర్‌ లేక్‌ ఏర్పడొచ్చు. మళ్లీ భారీ వర్షం పడొచ్చు. కొత్త కొండచరియలు విరిగిపడొచ్చు. నదీ మార్గాలు మూసుకుపోవచ్చు. ఆ అడ్డంకులు తెగితే మరో ఫ్లాష్‌ఫ్లడ్‌ రావొచ్చు. అందుకే ఇప్పుడు అసలు పోరాటం వరదతో కాదు. తదుపరి ప్రమాదాన్ని ముందే గుర్తించడంతో ఉంది. హిమాలయాల్లో ప్రకృతిని ఆపలేం. కానీ ప్రమాదం వచ్చే దారిని ముందే గుర్తిస్తే ప్రాణాలను కాపాడొచ్చు. ముందస్తు హెచ్చరిక. నిరంతర లొకేషన్‌ ట్రాకింగ్‌.వేగవంతమైన రెస్క్యూ వంటి అంశాలను చూడాలి. ఈ మూడు వ్యవస్థల్లో ఒక్కటి విఫలమైనా.. పర్వత ప్రాంతాల్లో చిన్న ప్రమాదం పెద్ద విపత్తుగా మారొచ్చు.

వరద వెళ్లిపోవచ్చు. కానీ వరద వదిలిన ప్రమాదం మాత్రం ఇంకా అక్కడే ఉండొచ్చు. నేపాల్‌ ఇప్పుడు ఎదుర్కొంటున్న అసలు సవాలు ఇదే. ఒక జల ప్రళయం నుంచి బయటపడటం మాత్రమే కాదు. దాని తర్వాత వచ్చే మరో జల ప్రళయాన్ని ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకోవడం కీలకం.

-కొండవీటి శివనాగరాజు,  డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్, టీవీ9.