July 20, 2026

రామ్‌ చరణ్‌ RC17పై ఆందోళనలో అభిమానులు.. సుకుమార్‌‌ ఆ పని చేయకపోతే కష్టమేనా..!

రామ్‌ చరణ్‌ RC17పై ఆందోళనలో అభిమానులు.. సుకుమార్‌‌ ఆ పని చేయకపోతే కష్టమేనా..!
Reading Time: 2 minutes
రామ్‌ చరణ్‌ RC17పై ఆందోళనలో అభిమానులు.. సుకుమార్‌‌ ఆ పని చేయకపోతే కష్టమేనా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సి 17 విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకా అనుకుంటున్నారా.. అది నటన, సినిమా కథా సెలక్షన్ విషయంలో కాదండీ.. సినిమా నిర్మాణంలో వేగం గురించి కూడా ఆచితూచి అడుగులు వేయాలని. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత ఇప్పటి వరకు చరణ్ చేసింది రెండు సినిమాలు మాత్రమే. 3 సంవత్సరాల తర్వాత గేమ్‌ ఛేంజర్, రెండేళ్ల తర్వాత పెద్ది సినిమాలను అభిమానులకు అందించారు చెర్రీ. ఇక నుంచి సినిమాల వేగం పెంచడం చరణ్ కెరీర్‌‌కే కాదు, టాలీవుడ్‌కు కూడా మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్ది తర్వాత..

పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారు. దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికంటే రెండు వందల శాతం ఎక్కువే ఇచ్చారు. అయితే దానికి తగిన ప్రతిఫలం కూడా చరణ్ అందుకున్నారు. పెద్ది సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక, వీలైనంత త్వరగా ఆర్సి 17  షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయడం చాలా అవసరం. గేమ్ ఛేంజర్ కోసం 3 సంవత్సరాలు, పెద్ది సినిమా కోసం 2 సంవత్సరాల సమయం ఇప్పటికే కేటాయించారు చెర్రీ.

ఆర్ఆర్ఆర్ సినిమా తెచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఈ సినిమాల కారణంగా వచ్చిన టైమ్‌తో మార్కెట్‌ రిస్క్‌లో పడే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రంగస్థలం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చిన సుకుమార్ తో చరణ్ మళ్లీ చేతులు కలపడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సుకుమార్ స్టైల్‌పై ఆందోళన..

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్సి 17 సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. సినిమాలను వేగంగా తెరకెక్కించే అలవాటు సుకుమార్‌‌కు లేదు. పుష్ప 1, పుష్ప 2 సినిమాల కోసం అల్లు అర్జున్ దాదాపు అయిదు సంవత్సరాల కాలాన్ని త్యాగం చేశారు. అయితే అందుకు తగిన ఫలితం బన్నీకి అందిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద అందుకు రిటర్న్‌ గిఫ్ట్‌ కూడా అందింది కాబట్టి సరిపోయింది. రామ్ చరణ్ విషయంలో సుకుమార్ అదే తరహాలో ఆలస్యం చేస్తే మాత్రం కెరీర్ పరంగా ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. పక్కా ప్లానింగ్ ఉంటే తక్కువ సమయంలోనే భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా తెరకెక్కించే ఛాన్స్ ఉందని పలు సినిమాలు నిరూపించాయి.

స్క్రిప్ట్‌ లాక్ అయిందా?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆర్సి 17 ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ముందు ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడది కేవలం సింగిల్ పార్ట్ కే పరిమితం చేస్తున్నారని ఫ్రెష్ అప్డేట్ అందుతోంది. ఈసారి పాత పద్ధతులకు భిన్నంగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్, మాఫియా కథాంశాలు లేకుండా ఒక సరికొత్త ఫ్రెష్ జానర్ ను ఎంచుకున్నారట.

స్టయిలిష్ యాక్షన్ తో పాటు మెగా అభిమానులు ఆశించే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్ ఒక ప్రత్యేక వీడియో రూపంలో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.