July 14, 2026

Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..

Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Reading Time: < 1 minute
Karnataka Minister Bairathi Suresh Bmtc Surprise Inspection Conductor Suspended

Karnataka:  కర్ణాటక రవాణా మంత్రి బైరతి సురేష్, ప్రయాణికుడి వేషంలో శనివారం రాత్రి బెంగళూర్‌‌లో బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రయాణికుల సౌకర్యాలను అంచనా వేయడానికి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఒక సాధారణ ప్రయాణికుడిగా నటిస్తూ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, బస్సు డ్రైవర్-కండక్టర్ పనితీరును అంచనా వేశారు. సుమారు 2 గంటల పాటు 10కి పైగా బస్సుల్లో ఆయన ప్రయాణించారు.

ఈ ఆకస్మిక తనిఖీల్లో మంత్రికి పలు షాక్‌లు తగిలాయి. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారు. నిర్లక్ష్యం మరియు నిబంధనల ఉల్లంఘనలను కారణంగా చూపుతూ, బీఎంటీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ మంత్రి కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీ సమయంలో ఒక ప్రయాణికుడు బస్సు దిగుతున్నానని చెబుతున్నప్పటికీ బస్ స్టాప్‌లో ఆపకపోవడంపై ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు.

ఇదిలా ఉంటే, మరో బస్సులో మంత్రికే ఓ కండక్టర్ షాక్ ఇచ్చారు. హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లీ మార్గంలో ప్రయాణిస్తుండగా, టికెట్ కోసం మంత్రి రూ. 100 నోటు ఇస్తే చిల్లర లేదని చెబుతూ కండక్టర్ మంత్రిని బస్సు దిగిపో అని హెచ్చరించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉద్యోగులు క్రమశిక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు మంత్రి సురేష్ ఈ చర్యలు తీసుకున్నారు.