Reading Time: < 1 minute

గంటకు 12 నిమిషాలు చాలు.. TV యాడ్స్పై ట్రాయ్ రూల్ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

Caption of Image.

ఢిల్లీ: గంటకు 12 నిమిషాలకు మించకూడదని టీవీల్లో ప్రకటనల వ్యవధిపై టెలికాం రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. టెలివిజన్ ప్రకటనలను గంటకు 12 నిమిషాలకు పరిమితం చేస్తూ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన నిబంధనను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమర్థించింది.

టీవీల్లో వాణిజ్య ప్రకటనలపై కాల పరిమితిని సవాల్ చేస్తూ పలువురు బ్రాడ్‌కాస్టర్లు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ అనిల్ క్షేత్రపాల్, అమిత్ మహాజన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

2013లో ట్రాయ్ ప్రవేశపెట్టిన ఈ నిబంధనను సవాలు చేయడంతో ఈ కేసులు దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాయ్ నిబంధన ప్రకారం.. ఛానెళ్లు గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత ఛానల్ ప్రచార కంటెంట్‌ను మాత్రమే ప్రకటనల రూపంలో ప్రసారం చేయాలి. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధనపై టీవీ నెట్వర్క్ యాజమాన్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

టీవీలకు ప్రకటనల రూపంలోనే ఆదాయం వస్తుందని.. ఆ వచ్చిన ఆదాయంలోనే ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తామని.. అలాంటిది ప్రకటనల వ్యవధిపై పరిమితి విధిస్తే ఛానెళ్ల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని యాజమాన్యాలు ట్రాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దాదాపు పదేళ్లుగా ఈ కేసు న్యాయ స్థానాల్లో నడుస్తూనే ఉంది.

©️ VIL Media Pvt Ltd.