Reading Time: 2 minutes
బొగ్గు అయిపోతుందా? అంధకారం తప్పదా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు, పెరుగుతున్న విద్యుత్ వినియోగం నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన బొగ్గు కొరత, పెద్ద ఎత్తున బ్లాక్‌అవుట్లు వంటి వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సంక్షోభం లేదని, జాతీయ విద్యుత్ గ్రిడ్ పూర్తిగా స్థిరంగా పనిచేస్తోందని కేంద్ర సమాచార ప్రసార విభాగం (పీఐబీ) ప్రకటించింది. ప్రజలు వదంతులను నమ్మవద్దని కూడా సూచించింది. ప్రస్తుతం దేశంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వద్ద 53.702 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇవి ప్రస్తుత అవసరాలను నిరంతరాయంగా తీర్చడానికి సరిపోతాయని పేర్కొంది. మే 2, 2026న దేశం 229 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ నియంత్రణ వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని అధికారులు వివరించారు.

విద్యుత్ వినియోగం మాత్రం రికార్డు స్థాయికి చేరుతోంది. ఏప్రిల్ 25, 2026న మధ్యాహ్నం 3:38 గంటలకు దేశంలో విద్యుత్ డిమాండ్ 256.1 గిగావాట్ల సర్వకాలిక గరిష్ట స్థాయిని తాకింది. అయినప్పటికీ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగలేదని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, దేశీయ అవసరాలు తీర్చుకుంటూనే పొరుగు దేశాలకు విద్యుత్ ఎగుమతులు కూడా కొనసాగుతున్నాయి. గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 27 వరకు విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 8–9 శాతం పెరిగింది. వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల్లో తాత్కాలిక తగ్గుదల, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, దుమ్ము తుఫానుల కారణంగా ఏప్రిల్ 26న డిమాండ్ స్వల్పంగా 238.15 GWకు తగ్గింది.

ఇక ముందున్న మే, జూన్ నెలల్లో వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విద్యుత్ డిమాండ్ 270 GW దాటే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో సన్నద్ధమైందని తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలోనే 65 GW అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించినట్లు వెల్లడించింది. మొత్తంగా ప్రస్తుతం దేశంలో విద్యుత్ కొరత లేదా భారీ బ్లాక్‌అవుట్లకు అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే పెరుగుతున్న వేడి, వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి