Reading Time: < 1 minute
చల్లదనం కోసం వెళ్తే.. చుట్టుముట్టిన తేనెటీగలు.. జాతరలో బీభత్సం.. ఆరుగురికి సీరియస్!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో వెలిసిన శ్రీనరసింహస్వామి జాతరలో ఆదివారం (మే 03) నాడు అనూహ్య విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఉత్సవాల్లో ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడటంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది భక్తులు గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

వేసవి తాపం దృష్ట్యా జాతరకు వచ్చిన భక్తులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయ పరిసరాల్లోని చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చెట్లపై ఉన్న తేనెతుట్టెలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఊహించని విధంగా తేనెటీగల గుంపు భక్తులపై దాడికి దిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా తేనెటీగలు కుట్టడంతో జాతర ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. భక్తులు తమను తాము రక్షించుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీశారు.

గాయపడిన వారందరినీ తక్షణమే స్థానికులు, పోలీసులు కలిసి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు వారిని మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళకరంగా సాగాల్సిన జాతరలో ఈ ప్రమాదం జరగడంతో భక్తుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..