
ఇరాన్‌తో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరే దశకు చేరుకుంది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి కేవలం రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందంలోని కొన్ని అంశాలు తన అంచనాలకు అనుగుణంగా లేకపోతే, ఇరాన్ తన హామీలను నిలబెట్టుకోకపోతే అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగుతుందని హెచ్చరించారు. “ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే బాంబు దాడులను తిరిగి ప్రారంభించడానికి వెనుకాడం” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
అమెరికా-ఇరాన్ మధ్య అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత రెండు దేశాలు ఒప్పందానికి చేరువైనట్లు కనిపించింది. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే, ఒప్పందం కుదిరినా దాని అమలుపై అమెరికా కఠిన వైఖరిని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఒప్పందం అధికారిక రూపం దాల్చుతుందా? లేక మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..