ప్రత్యేకమైన శరీర వాసన: దోమలు తమ ఆహారాన్ని వెతుక్కోవడానికి ప్రధానంగా వాటి అద్భుతమైన వాసన పసిగట్టే శక్తిని ఉపయోగిస్తాయి. మానవ చర్మం నుండి వచ్చే చెమట, శరీర నూనెల ద్వారా వందలాది రసాయన సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇది ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శరీర వాసనను ఇస్తుంది. ముఖ్యంగా ఎవరి శరీరంలో అయితే లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా, కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో.. వారిని దోమలు లొట్టలేసుకుంటూ కుడతాయి. దీనికి తోడు మన చర్మంపై ఉండే సహజ బ్యాక్టీరియా కూడా ఈ వాసనను ప్రభావితం చేసి దోమలను మరింతగా ఆకర్షిస్తుంది.
కార్బన్ డయాక్సైడ్ పరిమాణం: మనం శ్వాస వదిలిన ప్రతిసారీ వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దోమలు చాలా దూరం నుంచే ఈ CO2 ఉనికిని చాలా సులభంగా పసిగట్టగలవు. మనం వదిలే శ్వాసే వాటికి ఒక గైడ్‌లా పనిచేస్తుంది. శ్వాసక్రియ ద్వారా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేసే వయసు పైబడిన వారు, అలాగే కాస్త లావుగా ఉన్న వ్యక్తులను దోమలు చాలా త్వరగా గుర్తించి దాడి చేస్తాయి.
శరీర వేడి – చెమట: దోమలకు వెచ్చదనం, తేమ అంటే చాలా ఇష్టం. మనుషుల వాసన, CO2 ఆధారంగా మన దగ్గరకు చేరుకునే దోమలు.. ఆ తర్వాత రక్తం తాగడానికి శరీరంలోని అత్యంత వెచ్చని భాగాలను ఎంచుకుంటాయి. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఎండలో ఎక్కువగా శ్రమించేవారు లేదా విపరీతంగా చెమట పట్టే వారిపై దోమలు ఎక్కువగా దాడి చేస్తాయి. వెచ్చని చర్మం, తేమతో కూడిన చెమట దోమలకు పండగలా మారుతాయి.
మీ బ్లడ్ గ్రూప్ O నా?: కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. దోమలు కొన్ని నిర్దిష్ట రక్త రకాలకు ఎక్కువగా ఆకర్షింపబడతాయని తేలింది. ముఖ్యంగా A బ్లడ్ గ్రూప్ ఉన్నవారితో పోలిస్తే.. O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను దోమలు రెట్టింపు శాతం ఎక్కువగా కుట్టే అవకాశం ఉందని పరిశోధనల్లో కనుగొన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి.
గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్త: దోమల దాడి విషయంలో గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. గర్భధారణ సమయంలో మహిళల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు ఎక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ను కూడా బయటకు వదులుతారు. ఈ రెండు కారణాల వల్ల దోమలు గర్భిణీ స్త్రీల వైపు సులభంగా ఆకర్షించబడతాయి. అందుకే డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతున్న సమయంలో గర్భిణీలు దోమల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.




