
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గతంలో బెంగాల్, బిహార్ ఎన్నికల్లో ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం వల్లే అక్కడ పార్టీలు నష్టపోయాయి. మనం ఆ తప్పు చేయకూడదని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలు నిజాయితీగా జరిగితే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వంద సీట్లతో ఘన విజయం సాధించి తీరుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో జరిగిన సర్ ప్రక్రియను గుర్తు చేస్తూ… ఇప్పుడు 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ల లిస్ట్‌ను మ్యాపింగ్ చేయబోతున్నారని వివరించారు. ఇందులో లింకు ఓట్లు, లింకు లేని ఓట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 36 వేల పోలింగ్ బూత్‌లు, 3 కోట్ల 39 లక్షల ఓట్లు ఉన్నాయని… అలాగే ఖమ్మం జిల్లాలోనే 291 బూత్‌లు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే, ప్రతి పోలింగ్ బూత్‌కు ఒకరిని ఖచ్చితంగా నియమించాలని స్పష్టం చేశారు. బీఎల్ఏ (BLA), బీఎల్ఓ (BLO)ల పరిశీలన తర్వాత… జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలవుతుందని కేటీఆర్ తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు ఓటర్ల లిస్ట్‌లో ఉంటే వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. రాబోయే ఎన్నికలకు ఇదే ఫైనల్ ఓటర్ల లిస్ట్ కాబోతోందని, కాబట్టి అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదని కేడర్‌కు చెప్పారు.