Reading Time: 1 minute
అక్కడ వైరస్ మరణ మృదంగం.. వారం రోజుల్లోనే 44 నెమళ్లు మృతి.. వివరాలు ఇవిగో..!

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో నెమళ్ల మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. జాతీయ పక్షి అయిన నెమళ్లు పదుల సంఖ్యలో మరణించడం అటవీ శాఖతో పాటు జిల్లా యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి కారణం ప్రమాదకరమైన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ అని వైద్య పరీక్షల్లో తేలడంతో, ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

తుమకూరు జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి నెమళ్ల మరణాలు మొదలయ్యాయి. పొలాలు, చెట్ల పొదల్లో నెమళ్లు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 44కు పైగా నెమళ్లు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరణించిన నెమళ్ల నమూనాలను సేకరించి భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) కు పంపారు. దీంతో అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అవి ‘బర్డ్ ఫ్లూ’ వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది.

ముఖ్యంగా జిల్లాలోని కేసరండు, హిరేహళ్లి, గులూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధిక మరణాలు సంభవించాయి. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల పరిధిని కంట్రోల్ జోన్‌గా ప్రకటించారు. అటవీ, ఆరోగ్య, పశుసంవర్ధక శాఖలతో కూడిన సంయుక్త బృందాలు ఆ ప్రాంతాన్ని 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు ఉన్న పక్షులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో గాలింపు చేపట్టారు. ఈ వైరస్ పౌల్ట్రీ రంగానికి పాకకుండా ఉండేందుకు కోళ్ల ఫారాల నిర్వాహకులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి పౌల్ట్రీ ఫారంలో బయో-సెక్యూరిటీ చర్యలు పెంచాలని ప్రధాన అటవీ సంరక్షణాధికారి కుమార్ పుష్కర్ ఆదేశించారు.

మరోవైపు ఆరోగ్య శాఖ కూడా మానవులకు ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లాలోని ఆసుపత్రులలో పీపీఈ కిట్లు, మాస్కులు, యాంటీ వైరల్ మందులు మరియు టెస్టింగ్ కిట్లను సిద్ధంగా ఉంచారు. ప్రజలు చనిపోయిన పక్షులను తాకవద్దని, ఏదైనా అనుమానాస్పద మరణం కనిపిస్తే వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు. అదృష్టవశాత్తూ, ఏప్రిల్ 23వ తేదీ నుంచి కొత్తగా నెమళ్ల మరణాలు నమోదు కాలేదని అధికార యంత్రాంగం వెల్లడించింది. అయినప్పటికీ, వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..